కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు మూతపడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ప్రారంభించి నెలకాక ముందే బందయ్యింది. ఆదాయం రావడం లేదని, దాన్ని నడుపలేమని నిర్వాహకులు చేతులెత్తేశారు. బ్యాంకు నుంచి రూ. 5 లక్షల రుణం తీసుకుని క్యాంటీన్ ప్రారంభించగా, ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడంతో మూడు రోజుల వ్యవధిలోనే కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఆర్థికంగా తమను ఆదుకుంటుందన్న మహిళల ఆశలు ఆవిరయ్యాయి.
– తొర్రూరు, ఫిబ్రవరి 25
మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలని కాంగ్రె స్ సర్కారు ప్రవేశపెట్టిన ‘ఇందిరా మహిళా శక్తి పథకం’కు ఆదిలోనే ఆటంకాలు ఏర్పడ్డాయి. తొర్రూరులోని అన్నారం రోడ్డు సమీపంలో మదర్ థెరి స్సా మహిళా సహాయక సంఘం భవనంలో 2024 డిసెంబర్ 6న పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి ప్రారంభించారు. ఈ క్యాంటీన్ నిర్వహణకు వీవో అరుణజ్యోతి సంఘం ఆధ్వర్యంలో ఫత్తేపురం గ్రామానికి చెందిన జీవన జ్యోతి మహిళా పొదుపు సంఘం ముందుకొచ్చింది. ఇందులో ముగ్గురు సభ్యులు సంధ్య, పద్మ, హైమ బ్యాంకు నుంచి రూ. ఐదు లక్షల రుణాన్ని తీసుకొని, రూ. 4 లక్షలతో క్యాంటీన్ ప్రారంభించారు. ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభు త్వం సరైన ప్రణాళిక, అవగాహన లేకుండా పథకాన్ని ప్రవేశపెట్టడంతో మూడు రోజుల వ్యవధిలోనే మూతపడింది.
క్యాంటీన్ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి రోజూ రూ. 200-400 మధ్యే ఆదాయం వస్తున్న ద ని, నిర్వహణా వ్యయం భరించలేకపోతున్నామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నామని, కొనసాగించలేమని అధికారుల కు తేల్చి చెప్పారు. క్యాంటీన్ ఏర్పాటు చేసిన ప్రదే శం సరైనదేనా? లేకపోతే మార్చాల్సిన అవసరముందా? స్థానికులు వినియోగించేందుకు ఆసక్తి చూపడం లేదా? అన్న సందేహాలు నిర్వాహకుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇందిరమ్మ మహిళా క్యాంటీన్ ప్రారంభించి స్వ యం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని ఆశపడ్డా ను. కానీ వస్తున్న ఆదాయం పెట్టుబడికే సరిపోవడం లేదు. అదేవిధంగా సీఐఎఫ్ ద్వారా బ్యాంకు నుంచి రూ.4లక్షల రుణం తీసుకొని, రూము, తలుపులు, వంట సామగ్రి కోసం రూ.3,20,000 ఖర్చు చేశా ను. రెండు నెలలు కిస్తీలు రూ. 2400 కట్టాను. క్యాం టీన్ నడుపలేమని అధికారులకు విన్నవించాను.
– సంధ్య, జీవనజ్యోతి సంఘం సభ్యురాలు
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నడుపలేమని నిర్వాహకులు చెప్పేశారు. ఇంకా అధికారికంగా తెలియజేయలేదు. క్యాంటీన్ నిర్వహణలో ఎకువ మంది ఆసక్తి చూపితే టెండర్ ద్వారా కేటాయిస్తాం. దీని నిర్వహణ గరిష్ఠంగా నాలుగేళ్లపాటు ఉంటుంది. ఆ తర్వాత కొత్త వారికి అవకాశం కల్పిస్తాం.
-సంజీవరావు, ఏపీఎం, తొర్రూరు