హనుమకొండ చౌరస్తా : భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన, సుస్థిర, సమానత్వ గణ తంత్రరాజ్యంగా ఎదగాల్సిన మార్గదర్శక దృష్టిపై దేశవ్యాప్తంగా చర్చలు జరగాలని కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ప్రొఫెసర్ రామచంద్రం( Professor Ramachandram ) అన్నారు. హనుమకొండ సుబేదారిలోని పింగళి కాలేజీ రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండురోజుల జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా రాజ్యాంగ పరిరక్షణలో సుస్థిర విధానం ఇంకా పాతుకుపోలేదని పేర్కొన్నారు. 2047 నాటికి భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అత్యంత పటిష్ట గణతంత్ర వ్యవస్థగా నిలవగల సామర్థ్యం ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యవ్యవస్థను బలపరచడానికి ప్రతి పౌరుడూ రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టడం అత్యవసరమని సూచించారు.
ఓయూ రాజనీతిశాస్త్ర విభాగం విశ్రాంతి ఆచార్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలు రెండు ధోరణుల్లో కనిపిస్తున్నాయని, నియంతృత్వ ప్రభావం ఉన్న రిపబ్లిక్ వ్యవస్థలు ప్రజాస్వామ్యాన్ని సవాల్ చేస్తున్నాయన్నారు. భారతదేశంలో కాలక్రమేణా రాజకీయ వ్యవస్థ కుల,మత రాజకీయాలతో కలుషితం కావడంతో ఎన్నికల ప్రక్రియలో డబ్బు ప్రాధాన్యం పెరిగి ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందన్నారు.
అభివృద్ధి పేరుతో పేదల భూములను కోల్పోయే పరిస్థితులు కొనసాగుతుండటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఈ పరిస్థితులు 2047 నాటికి మరింత తీవ్రమవ్వ కుండా ప్రజలే ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బత్తిని చంద్రమౌళి , సెమినార్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, మల్లేశం, శ్రీనివాస్ , అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.