హనుమకొండ, ఫిబ్రవరి 18 : వేసవికి ముందే ఎండలు మండుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రివేళ కొంత చల్లగా ఉంటున్నా.. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో పాటు ఉక్కపోత కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం సైతం పెరుగుతున్నది. గత ఏడాది ఫిబ్రవరి 15న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,306 మెగా వాట్ల డిమాండ్ నమోదు కాగా, ఈ సారి అది 1,421 మెగావాట్లకు చేరుకున్నట్లు ఎన్పీడీసీఎల్ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన గత ఏడాదితో పోల్చితే 10 శాతం అధికంగా 115 మెగావాట్ల విద్యుత్ వినియోగమైనట్లు అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతల్లో హెచ్చుదల ఉండడంతో విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. మధ్యాహ్న సమయంలో 35 డిగ్రీల సెల్సియస్ దాటి ఎండ తీవ్రత నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లు, ప్యాన్లు విరివిగా వినియోగిస్తున్నారు. అంతేకాక వరితోపాటు ఇతరత్రా పంటల అవసరాలకు నీటి వినియోగం పెరగడంతో రైతులు వ్యవసాయ మోటర్లను నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం పెరుగుతున్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందించి చర్యలు తీసుకుంటున్నట్లు వారు పేర్కొంటున్నారు.
ఎన్పీడీసీఎల్ అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని ఐదు సర్కిళ్ల పరిధిలో మొత్తం 18,36,370 విద్యుత్ సర్వీసులున్నాయి. హనుమకొండ సర్కిల్ పరిధిలో అన్ని సర్వీసులు కలిపి 4,84,208, వరంగల్ 4,19,318, జనగామ 2,92,650, జయశంకర్ భూపాల్పల్లి 3,00,346, మహబూబాబాద్ సర్కిల్ పరిధిలో 3,39,848 సర్వీలున్నట్లు అధికారులు తెలిపారు.