ములుగు, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాలో ఇసుక లారీలు అడ్డూఅదుపు లేని వేగంతో దూసుకొస్తూ రాత్రింబవళ్లు నరకం చూపిస్తున్నాయి. వన దేవతల దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తున్నాయి. లారీల స్పీడ్‌కు బెంబేలెత్తిపోతున్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సమీపిస్తున్నప్పటికీ లారీల ద్వారా ఇసుక రవాణా మాత్రం ఆగడం లేదు. ముందస్తు మొక్కుల్లో భాగంగా నెల రోజులుగా ప్రతి బుధ, గురు, శని, ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో రోజుకు లక్ష మంది చొప్పున భక్తులు జాతీయ రహదారి-163 మీదుగా హైదరాబాద్, వరంగల్ నుంచి ములుగు, పస్రా, తాడ్వాయి గుండా మేడారానికి పలు వాహనాల్లో చేరుకుంటున్నారు.
ఈ క్రమంలో ఓవర్‌లోడ్, అధిక వేగంతో ఇసుక లారీలు వెళ్తుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. మహా జాతరకు మరో 20రోజుల సమయం మాత్రమే ఉన్నా అధికారులు ఇసుక లారీల రవాణాను కట్టడి చేయలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. మేడారం వెళ్లే వాహనదారులతో పాటు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు, ఎన్‌హెచ్‌పై ఛత్తీస్‌గఢ్, ఏటూరునాగారం, భద్రాచలం వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భయంభయంగా భక్తుల ప్రయాణం
జిల్లాలోని గోదావరి నది పరీవాహక ప్రాంతంలో గల క్వారీల నుంచి ప్రభుత్వ అనుమతులతో యార్డుల వద్ద ఇసుకను నింపుకొని రవాణా చేస్తున్నాయి. మంగపేట, వెంకటాపురం(నూగూరు), వాజేడు మండలాల నుంచి ఇసుకను సరఫరా చేసేందుకు మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో క్వారీలను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ వందలాది లారీలు హైదరాబాద్, వరంగల్ వంటి మహా నగరాల కు రవాణా చేస్తున్నాయి. నిబంధనల మేరకు ఒక్కో లారీలో పరిమితికి లోబడి ఇసుకతో రవాణా చేయాల్సి ఉండగా, క్వారీ నిర్వాహకుల అవినీతి కారణంగా పరిమితికి మించి ఓవర్ లోడ్, అధిక వేగంతో వెళ్తున్నాయి. అదేవిధంగా రవాణాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇసుక లారీలు ఫిట్నెస్ లేకున్నా అడిగే వారు లేక దర్జాగా వేగంగా ప్రయాణిస్తున్నాయి.
2024లో మేడారం జాతర సందర్భంగా 83 రోడ్డు ప్రమాదాలు జరిగి 89 మంది మృతి చెందగా, 211 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2025లో 73 ప్రమాదాలు జరిగి 77 మంది మృతి చెందగా, 152 మంది వాహనదారులు గాయపడ్డారు. ఇందులో అధిక శాతం ఇసుక లారీల కారణంగానే ప్రమాదాలు జరిగాయని అధికారులు పేర్కొంటున్నారు. జాతర సందర్భంగా ఇసుక లారీలను నియంత్రిస్తామని అధికారులు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆ దిశగా అమలు కాకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. జాతరకు రానున్న రోజుల్లో జనం పెరగనున్నది. కలెక్టర్, ఎస్పీ స్పం దించి జాతర పూర్తయ్యే వరకు ఇసుక లారీలను నిషేధించాల్సిన అవసరం ఉంది.