బచ్చన్నపేట సెప్టెంబర్ 18 : స్వచ్ఛతయే మన నినాదం.. ఆరోగ్యమే అన్నింటికన్నా ప్రధానం అని ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకి నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ -2025 పక్షోత్సవాలలో భాగంగా బచ్చన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బచ్చన్నపేట ప్రధాన కూడలిలో విద్యార్థులు, మహిళా సంఘ సభ్యులు, గ్రామ ప్రజలచేత మానవహారం, ర్యాలీ, స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్లో సుమారు 600 మంది తో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛతయే మన నినాదం – ఆరోగ్యమే అన్నింటికన్నా ప్రధానం అని అన్నారు. అందుకు ప్రతి ఒక్కరు స్వచ్ఛత పాటించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాలలో స్వచ్ఛత పై నిర్వహించిన రంగోళి, చిత్రలేఖనం పోటీల ని తిలకించి విజేతలకి బహుమతులని ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో డీపీవో స్వరూపరాణి ఎస్బీఎం కర్ణాకర్, ఎంపీడీఓ, మమతా బాయి, ఎంపీవో మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.