తాడ్వాయి/ఏటూరునాగారం/ములుగు రూరల్, డిసెంబర్16 : సమ్మక్క, సారలమ్మల మహాజాతర సందర్భంగా అమ్మవార్ల దర్శనానికి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అన్నారు. జాతర సమయంలో 3,500 బస్సులను నడపనున్నామని, 10 వేల మంది సిబ్బందితో 20 లక్షల మంది భక్తులకు సేవలందించనున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన మేడారం బస్టాండ్ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి, ఏటూరునాగారంలో బస్సు డిపో, ములుగులోబస్టాండ్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, మాట్లాడారు. గత జాతర కంటే ఎక్కువ బస్సులను భక్తులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. భక్తుల భద్రత, రక్షణే ధ్యేయం గా ఆర్టీసీ అధికారులు పోలీసులతో కలిసి పనిచేయాలని సూచించారు. డ్రైవర్లు, కండక్టర్లు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్తో చర్చించారు. ఏటూరునాగారంలో రూ. 4.99 కోట్లతో డిపో నిర్మాణ పనులు చేపడుతున్నామని, నాలుగు నెలల్లో పూర్తవుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రూట్లను బట్టి బస్సులను నడుపుతామన్నారు.
సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్గఢ్, ఏపీ రాష్ర్టాలకు బస్సులు నడిపే అవకాశాలున్నాయని, ముందుగా 50 బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. సెక్యూరిటీ, డీజిల్ బంక్, పార్కింగ్, మెకానికల్ షెడ్డు, కార్యాలయం తదితర వాటికి సంబంధించిన వివరాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ములుగు జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న బస్టాండ్ పనులను జాతరలోగా పూర్తిచేయాలని ఎండీ ఆదేశించారు. ఆయన వెంట ములుగు ఓఎస్డీ శివమ్ ఉపాధ్యాయ, ఆర్టీసీ ఈడీఎం మునిశేఖర్, ఈడీఈ వెంకన్న, ఈడీ సాల్మన్రాజ్, ఆర్ఎంలు విజయభాను, రవిచంద్ర, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శంకర్, పస్రా సీఐ దయాకర్, వరంగల్ బస్ స్టేషన్ మేనేజర్ మల్లేశం తదితరులున్నారు.