కమలాపూర్, అక్టోబర్ 27 : సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ బోగస్‌గా మారింది. పంట చేతికొచ్చినా కొనే దిక్కులేకపోవడంతో ధాన్యం దళారులకు చేరుతున్నది. ఈ వానకాలం నుంచే బోనస్ ఇస్తామని చెప్పడంతో పెట్టుబడి ఎక్కువైనా ఆశతో రైతులు సన్నాలు సాగు చేశారు. ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తుందోనని రోడ్లపై వడ్లు ఆరబోసుకొని రైతులు ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే పలుచోట్ల దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్కారు ప్రారంభించింది. కానీ, వారం రోజులు గడిచినా గన్నీ సంచులు అందుబాటులో లేకపోగా.. రైస్ మిల్లుల కేటాయింపు కూడా జరగలేదు. ప్రభుత్వం దొడ్డు రకం ఏ గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర రూ. 2,320, బీ గ్రేడ్‌కు రూ. 2,300 ప్రకటించింది. సన్నాలకు రూ. 500 బోనస్ ఇస్తే క్వింటాకు రూ. 2,800 రైతులకు దక్కనుండగా, దళారులు మాత్రం రూ. 2,600కే కొనుగోలు చేస్తున్నారు.
దీనికి తోడు అక్కడక్కడా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులపై ప్రశ్నిస్తున్న రైతులకు సమాధానం చెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాగా, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబాల, గూడూరు, ఉప్పల్, మరిపెల్లిగూడెం, గుండేడు, కన్నూరు, భీంపల్లి, శంభునిపల్లి, కానిపర్తి, దేశరాజ్‌పల్లి తదితర గ్రామాల్లో వరికోతలు ముమ్మరంగా కొనసాగుతుండగా, కేవలం కమలాపూర్, ఉప్పల్, గూడూరుల్లోనే అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
నాకు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు రూ. 500 బోనస్ ఇస్తామంటే ఆశపడి బీపీటీ రకం వరి సాగుచేశా. సన్నరకం కావడంతో ఎకరాకు సుమారు రూ. 30 వేల వరకు పెట్టుబడి అయ్యింది. వరి కోసి నాలుగు రోజులైనా కొనేవాళ్లు లేకపోవడంతో దళారులకు అమ్ముకుంటున్నం. దళారులు ప్రభుత్వం ఇచ్చే బోనస్ కలిపి కొనుగోలు చేస్తామని చెప్పి అంతా అయ్యాక రూ. 200 కోత పెడుతున్నరు.
– ఎర్రబెల్లి వేణురావు, రైతు
కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పేరుతో మోసం చేసింది. నాకు ఐదెకరాల పొలం ఉంటే బోనస్ వస్తుందని బీపీటీ సన్న రకం సాగు చేశా. పంట కోసి వారం రోజులైతాంది. పండించిన ధా న్యం అమ్ముకుందామంటే కొనేవాళ్లు లేక ఇబ్బంది పడుతున్నం. రోడ్లమీద పోసుకుని ఎదురుచూస్తున్నం. ప్రభుత్వం రూ. 500 బోనస్ ఇస్తదో? లేదో? చెప్పడం లేదు. ఇట్ల రోడ్ల మీద పోసుకొని ఎన్నిరోజులుండాలె. వర్షం వస్తే వడ్లు తడుస్తయనే భయం మొదలైంది.
– గండ్రకోట మల్లయ్య, రైతు