భీమదేవరపల్లి, జులై 29: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. చెరువులు, కుంటలు వదిలి ఇప్పుడు వాగులను తవ్వుతున్నారు. వాగుల్లోని మట్టిని ట్రాక్టర్ డబ్బాల్లో నింపి కడుగుతున్నారు. అలా కడిగిన మట్టి ఇసుకగా మారుతుంది. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల పనులు ముమ్మరంగా సాగుతుండటంతో వారికి ఇసుకను సరఫరా చేస్తున్నారు. నాణ్యత లేని ఇసుక వల్ల కట్టే ఇండ్లు బలంగా ఉండవని తాపీ మేస్త్రీ లు మొత్తుకుంటున్నారు. ఇసుక కూపన్లు అధికారులు ఇచ్చినప్పటికీ ట్రాన్స్ పోర్ట్ సమస్య తో చేసేది లేక గృహ నిర్మానదారులు నాణ్యత లేని ఇసుకను కొనుగోలు చేస్తున్నారు.
దీంతో ఇసుక అక్రమదారులు ఒక్కో ట్రాక్టర్ కు రూ.5 నుండి 6వేలు వరకు గుంజుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేం సంబంధం లేదనే చందంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సిద్దిపేట – హనుమకొండ ప్రధాన రహదారిపై ముల్కనూరు బ్రిడ్జి పక్కనే ట్రాక్టర్ డబ్బాల్లో ఇసుకను నింపి నిల్వ చేస్తున్నారు. ఇదంతా అధికారుల ముందు నుండే యదేచ్చగా ఈ దందా జరుగుతుందని మండల ప్రజలు బాహాటంగా పేర్కొంటున్నారు. అయితే ఇది తమ పని కాదని, మైనింగ్ డిపార్ట్ మెంట్ వాళ్ళు చూసుకోవాలని రెవెన్యూ అధికారులు మాట దాటేస్తున్నారు.
ఇదిలా ఉంటే నాణ్యత లేని ఇసుక వాడితే ఇండ్లు బలంగా ఉండవని, ఇంటి నిర్మాణ దారులు నష్టపోతే తామేమి చేస్తామని మండల పరిషత్ కార్యాలయం లో ఒక అధికారి బాహాటంగా పేర్కొన్నాడు. మెట్ట ప్రాంతమైన భీమదేవరపల్లి మండలంలో భూగర్భ జలాలు అడుగంటి పోతాయని తెలిసినా.. ఇసుకను తోడేస్తున్న అక్రమదారులపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.