హనుమకొండ సబర్బన్, జూన్ 19 : ఎన్నో యేండ్ల కల సాకారమవుతుందని, గోదావరి జలాలు పూర్తిగా మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ గడ్డకు చేరుకుంటాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా అక్కన్న పేట మండలం గౌరవెళ్లి ప్రాజెక్టు పనులను ఇంజినీరింగ్ అధికారులు, హనుమకొండ జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభిస్తామని ప్రకటించారు.
ఈ నెల 25 తర్వాత ఏ రోజైనా పంపులు ప్రారంభించి నీళ్లను ప్రాజెక్టులోకి పోయిస్తామని వివరించారు. హుస్నాబాద్ మెట్ట ప్రాంతాన్ని 50 ఏండ్లుగా ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య సాగునీరని అది ఇప్పుడు కేసీఆర్, హరీశ్‌రావు, ఇంజినీరింగ్ అధికారుల వల్ల తీరుతుందన్నారు. ఒక లక్షా ఆరు వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగు నీరు అందబోతోందని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో 1.4 టీఎంసీలతో డిజైన్ చేయబడిన ప్రాజెక్టును స్వరాష్ట్రం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో 8.23 టీఎంసీలు పెంచారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు కాళేశ్వరం ద్వారా 365 రోజులు నీళ్లు వస్తాయన్నారు. 96 మెగా వాట్స్ 2 పంపులు ఎప్పుడూ పని చేస్తాయని తెలిపారు. మరో పంపునూ అత్యవసరం కోసం అందుబాటులో ఉంచుతారని చెప్పారు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణం కోసం 3,870 ఎకరాలు స్థలం సేకరించినట్లు పేర్కొన్నారు.
దేశంలో ఎవ్వరికీ ఇవ్వని పరిహారం గౌరవెళ్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 0.17 టీఎంసీ నీళ్లు ప్రతిరోజూ గౌరవెల్లి ప్రాజెక్టుకు వస్తాయన్నారు. దీని ద్వార సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో 57,852 ఎకరాలు, అందులో అకన్నపేట 4,228, హుస్నాబాద్ 10,582, కోహెడ 11, 900, సైదాపూర్ 5,671, చిగురుమామిడి 14, 963, భీమదేవరపల్లి 10,508 ఎకరాలకు సాగునీరు, హనుమకొండ జిల్లాలో వేలేరు మండలంలో 4,832 ఎకరాలు, జనగామ జిల్లాకు 48,148 ఎకరాలకు సాగునీరు అందుతాయని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.2,215 కోట్లు కాగా లిఫ్ట్ పంపు, స్థల సేకరణకు రూ. 484.76 లక్షలు. కేటాయించామన్నారు.
ఇందులో కుడి లిఫ్ట్ ద్వారా 90 వేల ఎకరాలు, 47 కిలోమీటర్లు సాగునీరు, ఎడమ కాల్వ ద్వారా 16 వేల ఎకరాలు 16 కిలోమీటర్లకు సాగునీరందుతుందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వ కోసం రూ. 250 కోట్ల స్థల సేకరణ కోసం వ్యయం చేశామన్నారు. 3,919 ఎకరాలు స్థల సేకరణ జరగాల్సి ఉండగా ఇందులో 1,676 ఎకరాలు స్థలం సేకరించామని, ఇంకా 2,243 ఎకరాల స్థలం మిగిలి ఉందని తెలియజేశారు. గౌరవెళ్ల్లి ప్రాజెక్టు తర్వాత 1.5 టీఎంసీ సామర్థ్యం గల గండిపల్లి ప్రాజెక్టు 14,000 ఎకరాలకు సాగునీరందించే ఉద్దేశంతో నిర్మించడం జరుగుతుందని దీనిని త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈనెల 25న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గోదావరి జలాలతో గౌరవెల్లి ప్రాజెక్టు నింపి ప్రజలు, రైతుల ఆకాంక్ష నెరవేరుస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు.