హనుమకొండ, జూన్ 16: బీఆర్ఎస్ పార్టీలోకి పలువురు భారీగా చేరారు. హనుమకొండలో చీఫ్‌విప్ దాస్యం ఆధ్వర్వంలో 300 మంది చేరగా, నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది ఆధ్వర్యంలో వంద కుటుంబాలు చేరాయి. గ్రేటర్ 11వ డివిజన్ బీజేపీ అభ్యర్థి ప్రేమలతా కమల్ 300 మంది అనుచరులతో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంతకు ముందు డివిజన్ నుంచి హనుమకొండ బాలసముంద్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో రాగా చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులు వారికి స్వాగతం పలికారు. అనంతరం చీఫ్‌విప్ వారికి కండువా కల్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రేమలతా కమల్ తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరడం బీజేపీ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారు బీజేపీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరాలని ఉత్సాహంతో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన శక్తి అన్నారు. పార్టీ కన్నా ప్రాంత అభివృద్ధి ముఖ్యమని ప్రేమతా కమల్ బీఆర్ఎస్లో చేరారన్నారు. గతంలో తాను ఓడిపోయినా నిరాశ చెందకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కృషి చేసేవాడినన్నారు. నాలాగే ప్రేమలత రెండు సార్లు ఓడిపోయినా పట్టుదలతో డివిజన్ సమస్యలను స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేశారన్నారు. నిజాయితీ గల నాయకులుగా పేరు ప్రఖ్యాతలు పొందారన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన చట్టంలోని ఒక్క హామీని అమలు చేయలేదని, దేవుని భజనలు చేస్తున్నారు కానీ, నిధులు ఇవ్వడం లేదని నిరాశ చెంది, నాపై ఉన్న నమ్మకంతో బీఆర్ఎస్లో చేరారన్నారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలోని ప్రతి కార్యకర్తను సీఎం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో కంటికి రెప్పలా కాపాడుకుంటామని చీఫ్ విప్ పేర్కొన్నారు. ప్రేమలతా కమల్ మాట్లాడుతూ బీజేపీలో చేరి ఇన్ని రోజులు చాలా కోల్పోయామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వేయిస్తంభాల దేవాలయం, బయ్యారం ఉకు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా అడ్డుపడుతోందన్నారు. నగరాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నగర అభివృద్ధి పాటుపడుతున్న బీఆర్ఎస్ పార్టీ, చీప్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో పనిచేయాలనే సంకల్పంతో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
గతంలో టీఆర్ఎస్ పార్టీలో వినయ్‌భాస్కర్ కోసం పనిచేశానని, కొన్ని కారణాల వల్ల బీజేపీలో చేరాల్సి వచ్చిందన్నారు. దాస్యం వినయ్భాస్కర్పై తనకు నమ్మకం ఉందన్నారు. డివిజన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చెర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చెర్మన్ ఎండీ అజీజ్ ఖాన్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, 11వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మీ సురేందర్, కుడా మాజీ చెర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్ వద్దిరాజు గణేశ్, జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.