జనగామ చౌరస్తా, అక్టోబర్ 27: జనగామ జిల్లా కేంద్రంలోని షాపింగ్ మాల్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు కాంప్లెక్స్ చుట్టుపక్కలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో విలువైన వస్ర్తాలు కాలి బూడిదయ్యాయి. రూ.15 కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వివరాలిలా ఉన్నాయి. విజయ షాపింగ్ మాల్ నుంచి ఆదివారం ఉదయం 5.30 గంటలకు పొగలు రావడంతో వాకర్స్ గమనించి పోలీసులకు సమాచారమందించగా వారు అక్కడికి చేరుకునే సరికే మంటలు బయటకు వ్యాపించడంతో ఆ ఏరియాకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
మాల్ పైఅంతస్తులో ఉన్న గ్యాస్ సిలిండర్ భారీ శబ్ధంతో పేలడంతో అక్కడున్న జనం ఒక్కసారిగా భయంతో పరుగులుపెట్టారు. గంటన్నర ఆలస్యంగా ఫైర్ ఇంజిన్ ప్రమాద స్థలానికి చేరుకోవడంతో అప్పటికే మంటలు దావానలంలా వ్యాపించాయి. ఒక్క ఫైర్ ఇంజిన్‌తో మంటల్ని అదుపు చేయడం రెస్క్యూ టీమ్‌కు సాధ్యం కాలేదు. ఈలోపు విజయ షాపింగ్ మాల్ పక్కనున్న శ్రీలక్ష్మి షాపింగ్‌మాల్, ఎస్ఆర్ బద్రర్స్ బట్టల దుకాణంలోకి మంటలు వ్యాపించాయి. అందులో ఉన్న విలువైన వస్ర్తాలతో పాటు ఫర్నిచర్ ఇతర సామగ్రి కాలిపోయింది.
దీంతో నష్టపోయిన బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ రెస్క్యూలో పాల్గొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. జనగామతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, మోత్కూరు, ఆలేరు, భువనగిరి, యాదగిరిగుట్ట నుంచి ఏడు ఫైర్ ఇంజిన్లను రప్పించి మంటలను అదుపు చేశారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఏసీపీ పార్థసారథి నేతృత్వంలో అర్బన్ సీఐ దామోదర్‌రెడ్డి బందోబస్తు నిర్వహించారు. అగ్నిమాపకశాఖ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
షాపింగ్ మాల్లో ఫైర్ సేఫ్టీ ఉంటే చుట్టుపక్కల ఉన్నవారిని అలర్ట్ చేసేలా సైరన్ వినపడేది. జనగామలో ఏ ఒక్క షాపింగ్ మాల్‌కు ఫైర్ సేఫ్టీతో పాటు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ లేదని అధికారులు వెల్లడించారు. కాగా, పక్కనే ఉన్న ముత్తూట్ గోల్డ్‌లోన్ ఫైనాన్స్‌లో ఉన్న రూ.30 కోట్ల విలువైన బంగారంతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాదారులు దాచుకున్న రూ.70 కోట్ల బంగారు ఆభరణాలు సేఫ్‌గా ఉన్నాయి. మంటలు అదుపులోకి రాకుంటే భారీ మొత్తంలో ఆస్తినష్టం జరిగేది.