ఆ ప్రాంతంలో పండించే మిర్చికి ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ఐటీసీ, విల్సన్ లాంటి కారంపొడి కంపెనీలే రైతుల వద్దకు వచ్చి మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లించేందుకు పోటీపడుతుంటాయి. అంతేకాదు దేశం దాటి యూరప్, జర్మనీ, ఈజిప్ట్, అమెరికా ఇలా ఖండాంతరాలకు ఎగుమతి అవుతుందంటే ఇక్కడి ఎర్రబంగారానికి ఎంత క్రేజో చెప్పనక్కర్లేదు. చీడపీడలు ఆశిస్తే పురుగుమందులు వాడకపోవడం, సేంద్రియ విధానంతో పాటు పరిమితంగా ఎరువుల వినియోగం, మేలైన వ్యవసాయ పద్ధతులు పాటించడం వల్లే నాణ్యమైన మిర్చికి కేరాఫ్‌గా మారింది రేగొండ మండలం గూడపల్లి. ఇదంతా ఒకరిద్దరు కాదు 1793మంది రైతుల సమష్టి సాగు వల్లే సాధ్యమైంది. 95శాతం రైతులందరూ ఇలా ఒకే రకం పంటను సాగుచేయడం వల్ల ఎకరానికి రూ.లక్ష దాకా ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
రేగొండ, ఏప్రిల్ 10 : భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని గూడెపల్లి గ్రామం మిర్చి సాగుకు కేరాఫ్‌గా మారింది. ఇక్కడి రైతులంతా సమష్టిగా సాగు చేస్తుంటారు. గ్రామంలో 95శాతం మిర్చి పంటనే పండిస్తారు. ఇప్పుడిప్పుడే చుట్టపక్కల గ్రామాల రైతులు వారిని ఆదర్శంగా తీసుకొని మిర్చి సాగుచేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. ఈ ఏడాది గూడెపల్లెతో పాటు బాగిర్తిపేట, కొడవటంచ, మడ్తుపల్లి, పోనగల్లు, లింగాల గ్రామాల్లోని 1,793 రైతులందరూ కలిసి 2,868 హెక్టార్లలో మిర్చి సాగుచేశారు. సాగులో పురుగుమందుల తక్కువగా వినియోగిస్తారు. చీడపీడలు ఆశిస్తే రసాయనిక ఎరువులు వాడరు. ఎక్కువగా సంప్రదాయ గ్రామీణ పద్ధతుల్లో పంటను రక్షించుకొని ఆధిక దిగుబడులు సాధిస్తారు.
రైతులంతా సమష్టిగా ఒకే రకం పంట సాగు చేయడం వల్ల తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభంతో పాటు మంచి డిమాండ్ కూడా వస్తున్నది. మేలైన వ్యవసాయ పద్ధతులు పాటించడం వల్ల ఇక్కడి మిర్చికి అంతర్జాతీ యంగానూ గిరాకీ పెరిగింది. అందుకే కారంపొడి తయారుచేసే వివిధ కంపెనీల ప్రతినిధులు గ్రామాలకే వచ్చి కొనుగోలు చేస్తుంటారు. పంట నాణ్యతను పరీక్షించి, కొనుగోలు చేసి తీసుకెళ్తారు. ఎకరానికి 25 క్వింటాళ్ల నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా ఏటా 2500 టన్నుల మిర్చిని వరంగల్‌లోని ఎస్ఆర్ఎం అనే అడ్తి వ్యాపారుల ద్వారా ఐటీసీ, విల్సన్, తదితర కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఇక్కడ తేజ, ఆర్మూర్, వండర్‌హాట్, 5531, 314 రకాలు పండిస్తున్నారు. విల్సన్ అనే విదేశీ కంపెనీ ఓ ఉద్యోగి ద్వారా నేరుగా కొనుగోలు చేస్తుండగా, ఇతర కంపెనీలు అడ్తివ్యాపారుల ద్వారా కొనుగోలు చేస్తున్నాయి. ఎలాంటి కమీషన్లు, కోతలు, రవాణా, గన్నీ సంచుల భారం లేకుండా మార్కెట్ ధర కంటే ఆదనంగా చెల్లించి పంటను కొనడం విశేషం. అంతేగాక ఇక్కడ పండిస్తున్న ఎర్రబంగారం ఖండాతరాలకు తరలిపోతుండడంతో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రైతులకు గుర్తింపు వస్తోంది. రాష్ట్రంలో పండిన మిర్చిని ప్రపంచ దేశాలు పోటీ పడి దిగుమతి చేసుకోవడం వల్ల రైతుల ఆనందానికి అవుధుల్లేకుండా పోతున్నది.
పదేళ్లుగా సాగు చేస్తున్నా..
పదేల్లుగా 10 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నా. నాతో పాటు చాలామంది రైతులు వ్యవసాయాధికారులు, కంపెనీ వారు సూచించిన పురుగుమందులు, ఎరువులనే వినియోగిస్తారు. పురుగుమందులు తక్కువగా వాడుతాం. అందుకే నాణ్యంగా ఉంటుంది. కంపెనీ వారు మా దగ్గరికే వచ్చి పంటను తీసుకెళ్తారు. రవాణా, కమీషన్, ఖర్చులు లేవు. మార్కెట్ ధర కంటే ఎక్కువ రేటు కట్టిస్తారు. ఖర్చులు పోగా ఒక ఎకరానికి ఏడాదికి రూ.లక్ష వస్తుంది. మిర్చికి మంచి ధర రావడం వల్ల ఏండ్ల తరబడి ఇదే పంట వేస్తున్నారు. ఇతర పంటలను సాగు చేయడం లేదు.
– కొల్గూరి రాజేశ్వర్‌రావు, రైతు, గూడపల్లి
ఏడాదికి 3లక్షల ఆదాయం
గ్రామంలో మూడెకరాల వ్యవసా య భూమి ఉంది. ఐదేండ్లుగా మిర్చి పంట సాగుచేస్తున్న. వివిధ కంపెనీల వాళ్లే గ్రామాలకు వచ్చి పంటను కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్ కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. ఖర్చులు పోను ఎకరానికి రూ.లక్ష నుంచి 1.50 లక్షల వరకు మిగుల్తాయి. మూడెకరాలకు సుమారు 3లక్షల నుంచి 3.50 లక్షల వరకు లాభం వస్తుంది.
– ముద్దమల్ల సమ్మయ్య, రైతు, గూడపల్లి
ఏడాది పొడవునా ఒకే ధర
ఇక్కడి మిర్చిని ఏడాది పొడవునా ఒకే ధరకు కొనుగోలు చేస్తాం. సాగు సమయంలోనే రైతులకు అవగాహన కల్పిస్తాం. సమష్టి వ్యవసాయాన్ని ప్రోత్సహి స్తూ మా కంపెనీ ప్రతినిధులు నిత్యం పంటలను పరిశీలించి, ఎప్పుడు ఏయే ఎరువులు, పురుగు మందులు వాడాలో సూచనలు చేస్తాం. నాణ్యత ఉండేందుకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తాం. మార్కెట్ కంటే అధిక ధరకు కొనుగోలు చేస్తాం. పంట మొత్తానికి ఒకే ధర 10 రోజుల్లోనే చెల్లిస్తాం. రైతులకు ఇతర ఎలాంటి ఖర్చులు ఉండవు.
– సిరికొండ రామారావు, ఎస్ఆర్ఆర్ కంపెనీ ప్రతినిధి