కరీమాబాద్, అక్టోబర్ 19 : వరంగల్‌లోని ఉర్సు రంగలీల మైదానంలో ఆదివారం నరకాసురవధ భారీ జనసందోహం నడుమ కనుల పండువగా జరిగింది. వరంగల్ మహానగరపాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి నిప్పంటించగా పటాకుల పేలుళ్లతో 58 అడుగుల భారీ ప్రతిమ దహనమైంది. ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ తారాజువ్వలు ఆకట్టుకున్నాయి.
అంతకుముందు కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. ఉర్సు ప్రతాప్‌నగర్ నుంచి శ్రీకృష్ణ-సత్యభామ వేషధారణలో కళాకారులను ఊరేగింపుగా మైదానానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరపల్ల రవి మాట్లాడుతూ అధికారం ఉందని కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రభుత్వమే ఉత్సవాలను నిర్వహించాలన్నారు. దాతలను కమిటీ చేతుల మీదుగా సత్కరించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.