నర్సింహులపేట, నవంబర్ 3 : పొలం దున్న లేదు.. నాటు వేయలేదు.. విత్తనం చల్లలేదు. మందులు వేయలేదు.. మందులు పిచికారీ అస్సలే చేయలేదు.. అయినా పంట మాత్రం చేతికి వచ్చింది. రూపాయి ఖర్చు లేకుండా ఎకరానికి 20 నుంచి 25 బస్తాల వరి ధాన్యం చేతికి అందింది. మొన్నటి వానకాలంలో అనుకున్నదాని కంటే అతి భారీ వర్షాలు పడడమే ఇందుకు కారణం. ఇదెలా అనుకుంటున్నారా? అవును ఇది సాధ్యమే. యాసంగి పంట కోసిన తర్వాత వర్షాలు ఎక్కువై మళ్లీ సాగుచేసే అవకాశం లేక పొలాన్ని అలాగే వదిలేశాడు. అలా కొయ్యకాళ్ల నుంచి మొలకలు వచ్చి.. ఆ రైతు పంట పండింది. ఇలా పెట్టుబడి పెట్టకుండానే చేసే జీరో టిల్లర్ సాగుతో కొమ్ములవంచలోని ఇద్దరు రైతులకు లాభం చేకూరుతోంది.
నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామానికి చెందిన దాసరోజు వీరాచారి, జేరిపోతుల సైదులు అనే ఇద్దరు రైతులకు వరిసాగు చేసుకునేందుకు పొలం ఉంది. పాత చెరువు కింద వీరాచారికి ఎకరం, సైదులు 10 గుంటల పొలం ఉంది. గత యాసంగిలో ఆర్ఎన్ఆర్ రకం వరి సాగు చేశారు. ఎకరానికి 35నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. అయితే ఈ ఏడాది వానకాలంలో వరి సాగు కోసం నారు పోశారు. భారీ వర్షాల కారణంగా పొలం దున్నడం, వరి నాటువేసే అవకాశం లేకుండా పోయింది. చేసేదేమీ లేక వదిలేశారు. యాసంగిలో వరి కోసిన తర్వాత ఉన్న కొయ్యకాళ్లు(వరి కొయ్య) నీటి బురుదలో నాని పచ్చబడ్డాయి. నాటు వేసిన వరి మాదిరిగానే ఏపుగా పైరు పెరిగింది. అయినా పంట వస్తుందనే నమ్మకం వారిలో లేదు. అందుకే ఎలాంటి దుక్కి మందు, యూరియా కూడా వేయలేదు. ఎలాంటి మందులు వాడలేదు. అయినా కూడా అన్ని వరి రకాల మాదిగానే కంకులు వచ్చాయి. ప్రస్తుతం సైదులు తన 10గుంటల పొలంలో 4 బస్తాల వడ్లు దిగుబడి వచ్చింది. వీరాచారి ఎకరం పొలం కూడా కోతకు వచ్చింది. సుమారు 20 నుంచి 25 బస్తాల వరి దిగుబడి వచ్చే అవకాశం ఉందని సంతోషంగా చెబుతున్నాడు.