ఉద్యాన పంటల సాగు రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నది. దీంతో వరి సాగు తర్వాత అధిక శాతం ఈ పంటల వైపే మొగ్గు చూపుతూ ఆదాయం పొందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 16,504 మంది రైతులు 25,700 ఎకరాల్లో వీటినే సాగు చేస్తున్నారు. అత్యధికంగా సుగంధ ద్రవ్యాలు, పండ్ల తోటలు, ఆయిల్ పాం తోటలపై మక్కువ కనబరుస్తున్నారు. దీర్ఘకాలిక పంటలు పండిస్తూ తక్కువ పెట్టుబడితో ఏళ్ల తరబడి రాబడి ఆర్జిస్తున్నారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలే మేలని నిరూపిస్తున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి, జనవరి 16 (నమస్తే తెలంగాణ)
జిల్లాలోని 12 మండలాల్లో 25,700 ఎకరాల్లో 1650 4 మంది రైతులు ఉద్యాన పంటలు పండిస్తూ అ ధిక లా భాలు ఆర్జిస్తున్నారు. 1045 ఎకరాల్లో 667 మం ది రైతు లు పండ్ల తోటలు, 82 ఎకరాల్లో 162 మంది రైతులు కూరగాయలు, 20,202 ఎకరాల్లో 13,918 రైతులు సు గంధ ద్రవ్యాలు, 50 ఎకరాల్లో 31 మంది రైతులు సెరికల్చర్, 640 ఎకరాల్లో 470 మంది రైతులు ఆగ్రోఫారెస్ట్, 29 ఎకరాల్లో 20 మంది రైతులు బోర్డర్ ప్లాంటేషన్, 3 ఎకరాల్లో ఏడుగురు రైతులు పూలతోటలు, 3649 ఎకరాల్లో 1229 మంది ఆయిల్‌పాం పంటలు సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సర్వే కొనసాగుతుందని, ఈ పంటల విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం ఉందని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు.
ఆరుతడి పంటలతో లాభాలు
రేగొండ, చిట్యాల, భూపాలపల్లి, కాటారం, మహదేవపూర్, మల్హర్ మండలాల్లో రైతులు కూరగాయల పంటలు సాగుచేస్తూ జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి విక్రయాలు జరుపుతూ మంచి ఆదాయం పొందుతున్నారు. జిల్లాలో మొత్తం 2021-22 నుండి 2024-25 వరకు 3,649.57 ఎకరాల్లో 1229 మంది రైతులు ఆయిల్‌పాం సాగు చేశారు. ఇందులో మొదటి విడ తగా 2021-22లో 112 మంది రైతులు 352.55 ఎకరాల్లో సాగు చేశారు. అలాగే 2022-23లో 609 మంది రైతులు 1877.53 ఎకరాల్లో, 2023-24లో 411 మంది రైతులు 1163.90 ఎకరాల్లో సాగు చేశారు. 2024-25 లో 97 మంది రైతులు 255.58 ఎకరాల్లో ఆయిల్‌పాం పంటను సాగు చేశారు. అయితే ఆయిల్‌పాం నాలుగేళ్ల వరకు పంట చేతికి రాదు. కాగా నాలుగేళ్ల పాటు ఆయిల్పాంలో అంతర పంటలుగా కూరగాయలు, ఇతర ఆరుతడి పంటలు సాగు చేసుకుంటూ రైతులు రెండు రకాలుగా ఆదాయం పొందుతున్నారు. ఆయిల్‌పాం పంట దిగుబడి ప్రారంభమైనా అంతర పంటలు వేసుకునే అవకాశం ఉంది.
లాభసాటి పంట ఆయిల్ పాం
వరి, మిర్చి ఇతర పంటల్లాగ దీనికి భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన పని లేదు. ఒక్కసారి నాటి సస్యరక్షణ చర్యలు చేపట్టుకుంటూ పోతే 40 ఏళ్లకుపైగా దిగుబడి పొందవచ్చు. నేను మూడెకరాల్లో ఆయిల్‌పాం మొక్కలు నాటిన. అంతకు ముందు పెట్టుబడి పెట్టలేక భూమిని పడావు పెట్టిన. అధికారుల సూచన మేరకు ఆయిల్‌పాం సాగు మొదలు పెట్టిన క్రాప్ మొదలైంది. రైతులు వరికి, మిర్చికి ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్‌పాంను ఎంచుకోవాలి. మార్కెట్లో ధర ఎంత తగ్గినా నష్టమైతే ఉండదు.
– పువ్వాటి సత్యనారాయణరావు, గుంటూరుపల్లి, చిట్యాల మండలం