నర్సంపేట, జూలై 11 : వరి సాగులో నారు సిద్ధం చేసుకున్నప్పటికీ కూలీల సమస్యతో అనుకున్న సమయానికి నాటు వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో పంటల దిగుబడి తగ్గి రైతాంగం అప్పుల పాలవుతున్నది. ఈ క్రమంలో మెట్ట వరి సాగు సిరులు కురిపిస్తున్నది. ఈ పద్ధతిలో వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ పొలంలో దమ్ము చేయకుండానే నేరుగా వడ్ల విత్తనాలు విత్తడంతో పెట్టుబడి తక్కువతో పాటు పంట ముందే చేతికి వస్తున్నది. దీంతో కర్షక లోకం ఈ సాగు పట్ల ఆసక్తి చూపుతున్నది.
రోజురోజుకూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు వ్యవసాయ సాగులో అధునాతన, నూతన మెళకువలను పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. కూలీల కొరత, ట్రాక్టర్ కిరాయిలు, తదితర ఖర్చులను దృష్టిలో పెట్టుకుని మెట్ట వరి సాగు చేసి సిరులు పండిస్తున్నారు. ఈ సాగుకు ఎర్ర, మధ్యస్థ నేలలు అనుకూలంగా ఉంటాయి. సాగుకు ముందు ఎకరానికి 4 క్వింటాళ్ల పశువుల ఎరువు వేసి 4 నుంచి 5 సార్లు పొడి దుక్కిని దున్నుకోవాలి. ఆ తర్వాత విత్తన శుద్ధి చేసుకొని సీడ్ డ్రిల్ యంత్రంతో విత్తనాలను విత్తుకోవాలి. ఎడ్ల సహాయంతో గొర్రు ద్వారా వరుసలుగా చేసుకొని అందులోనే వడ్లను విత్తుకోవాలి. ప్రతి వరుస మధ్య అడుగు దూరం ఉండేలా, 2 అంగుళాల లోతులో విత్తనాలు పడేలా చూసుకోవాలి.
విత్తిన తర్వాత వారం రోజులు వర్షం పడకపోయినా ఏమీకాదు. మట్టిలోని తేమ పూర్తిగా ఆరిపోకుండా చూసుకోవాలి. ఎకరానికి సన్న రకం వడ్లు 8-10 కిలోలు, దొడ్డు రకం 10-12 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఎనిమిది వరుసలు విత్తే సీడ్ డ్రిల్‌తో గంటలో ఎకరం పొలం విత్తనాలు వేస్తుంది. ఈ సాగుకు నీటి తడులు ఎక్కువగా అవసరం ఉండదు. విత్తనాలు వేసిన 40-45 రోజుల వరకు కలుపు మొలుస్తుంది. సైకిల్ గొర్రు, వీడర్ల సహాయంతో తొలగించుకోవాలి. విత్తనాలు వేసిన 48 గంటలలోపు కలుపు నివారణ మందును పిచికారీ చేసుకోవాలి. 20 నుంచి 25 రోజుల్లో 2-3 ఆకుల దశలో రెండోసారి కలుపును నివారించాలి. కూలీల సమస్య ప్రస్తుతం తీవ్రంగా ఉంది. మెట్ట వరి సాగులో కూలీలతో నాటు వేయాల్సిన అవసరం ఉండదు.
ఈ పద్ధతిలో నారు మడి దున్ని, వడ్లు అలికి, నారు పోసి పెంచాల్సిన అవసరం లేదు. కూలీల ఖర్చులు తగ్గుతాయి. బురద దుక్కులు చేయాల్సిన పని లేదు. ఎకరానికి రూ.8 వేలనుంచి రూ. 10వేల వరకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. ఖరీఫ్, రబీలో ఈ సాగు చేపట్టవచ్చు. ఎకరానికి 10 కిలోల వడ్ల విత్తనాలు సరిపోతాయి. మామూలుగా ఎకరం నాటు వేసేందుకు కూలీలు రూ. 4వేల నుంచి రూ.4500ల వరకు తీసుకుంటున్నారు. అదే మెట్ట వరి సాగుతో ఎకరానికి రూ. 1500ల వరకు ఖర్చు మాత్రమే ఉంటుంది. దీపావళికే ఈ పంట చేతికి అందివస్తుంది. ముఖ్యం గా తుఫానులు, వరుస భారీ వర్షాల నుంచి బయట పడొచ్చు. ఎరువులు తక్కువే. సాగుకు ముందు డీఏపీని చల్లి ఆ తర్వాత పైపాటుకు యూరియాను వేయాల్సి ఉంటుంది.
నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామానికి చెందిన 78 మంది రైతులు 250 ఎకరాలకు పైగా ఈ దఫా మెట్ట వరి సాగుకు శ్రీకారం చుట్టారు. ఈసాగుతో రైతులు కొంత వరకు పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవచ్చు. రెండు క్రాపుల్లో మెట్ట వరి సాగును చేసుకోవచ్చు.
– మెండు అశోక్, ఏఈవో, నర్సంపేట
రైతులు మెట్ట వరి సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలి. తక్కువ పెట్టుబడితో పాటు ప్రకృతి వైపరీ త్యాల కంటే ముందే పంట చేతికి అందుతుంది. ఈసాగు వల్ల దిగుబడిలో ఏమ్రాతం తేడా రాదు. విత్తనాలు, కూలీల ఖర్చులు తగ్గుతాయి. ఖరీఫ్ పంట కాలం ముందుకు రావడం వల్ల రబీ కూడా నెల రోజుల ముందుకు వస్తుంది.
– కేతిడి దామోదర్‌రెడ్డి, ఏడీఏ, నర్సంపేట డివిజన్