ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీంలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఖజానా నింపుకోవడంపైనే సర్కారు దృష్టి పెట్టడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ గందరగోళంగా మారింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో 2020 ఆగస్టు నాటికి ఉన్న భూమి విలువపై ఫీజులు వేయాలని, ఆ తర్వాత వాటికి రిజిస్ట్రేషన్ తేదీ నాటి మార్కెట్ విలువపై రుసుము వసూలు చేయాలని ఉంది.
అయితే దానిని తుంగలో తొక్కి ప్రస్తుతం ఇప్పటి మార్కెట్ విలువపై 14 శాతం ఫీజులు వసూలు చేస్తుండడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్‌కు వెళ్లి ఎల్ఆర్ఎస్కు అర్హత ఉందా? లేదా? అనేది తేల్చి, ఉన్న వాటికే రుసుం వసూలు చేయాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో భూమిని, డాక్యుమెంట్లను పరిశీలించకుండానే వచ్చిన ప్రతి దరఖాస్తుకు ఫీజు ఫిక్స్ చేసి వసూలు చేయడం ఏంటని అర్జీదారులు ప్రశ్నిస్తున్నారు. తిరస్కరిస్తే 10 శాతం కట్ చేసి మిగతా 90 శాతం అకౌంట్లో జమచేస్తామంటున్నారని వాపోతున్నారు.
– వరంగల్, మార్చి 15
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేయకుండానే ఫీజులను ఫిక్స్ చేస్తున్నా రు. నిబంధనల ప్రకారం స్థలం వద్దకు వెళ్లి డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత అర్హత ఉంటే ల్యాండ్, దరఖాస్తుదారుడి ఫొటోలు తీసుకుని పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. తర్వాత డాక్యు మెంట్ ప్రకారం ఫీజులను ఫిక్స్ చేయాలి. బల్ది యా ఖజనా నింపుకోవాలన్న ఆలోచనతో ఎఫ్టీ ఎల్, బఫర్‌జోన్, ప్రభుత్వ భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు సైతం అధికారులు చార్జీలు ఫిక్స్ చేసి మెసేజ్‌లు పంపిస్తున్నారు. దీంతో చాలా మంది దరఖాస్తుదారులు అధికారులు వేస్తున్న రుసుము చెల్లించేందుకు జంకుతున్నారు. అడ్డగోలు ఫీజులపై ప్రశ్నిస్తే తప్పులను సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ లేదంటున్నారని బాధితులు పేర్కొంటున్నారు.
మార్చి 31వ తేదీలోపు ప్రభుత్వం 25 శాతం రాయితీ ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు, ఆ తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అప్పుడు నిబంధనల ప్రకారం లేకుంటే దరఖాస్తును తిరస్కరిస్తామని, వారికి చెల్లించిన ఫీజులో 10 శాతం కట్ చేసి మిగతా 90 శాతం ఫీజు అకౌంట్లో జమ చేస్తామంటున్నారు. ముందస్తుగా భూమిని పరిశీలించి ఎల్ఆర్ఎస్కు అర్హత ఉందా ? లేదా? అనేది తేల్చాలి, అర్హత ఉన్న వాటికే ఫీజులు వసూలు చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. సిబ్బంది కొరత ఉంటే ఔట్ సోర్సింగ్‌లో నియమించుకొని మార్చి 31 లోపు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని పేర్కొంటున్నారు.
నిబంధనల ప్రకారం పాత డాక్యుమెంట్లకు 2020 ఆగస్టు మార్కెట్ విలువ, 2020 తర్వాత డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువతో ఫీజులు వేయా ల్సి ఉంది. అయితే బల్దియా సిబ్బంది మాత్రం ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం ఫీజులు వేస్తున్నట్లు దరఖాస్తుదారులు వాపోతున్నా రు. దీంతో వేలలో రావాల్సిన ఫీజులు లక్షల్లో వస్తున్నాయని లబోదిబోమంటున్నారు.
రూ.3 వేల లోపు మార్కెట్ విలువ ఉన్న ప్రాంతంలో 20 శాతం, రూ. 5 వేల లోపు విలువున్న ప్రాంతంలో 30 శాతం, రూ. 10వేల లోపున్న ప్రాంతంలో 40శాతం, రూ. 20వేల లోపు 50 శాతం, రూ. 30 వేల లోపు 60 శాతం, రూ. 50 వేల లోపు 80 శాతం, రూ.50 వేల పైన మార్కెట్ విలువున్న ప్రాంతాల్లో 100 శాతం క్రమబద్ధీకరణ చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2020 నుంచి ఇప్పటి వరకు సుమారు 5 సార్లు ప్రభుత్వం మార్కెట్ విలువను పెంచిందని టెక్నికల్ పర్సన్స్ అంటున్నారు. అయితే పాత డాక్యుమెంట్లకు సైతం ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఫీజులు వేస్తుండడంతో దరఖాస్తుదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.