ఖిలావరంగల్, నవంబర్ 22 : వారసత్వ సంపదను కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర పురావస్తు శాఖ ఉమ్మడి జిల్లా అధికారి మడిపల్లి మల్లేశం అన్నారు. ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఓరుగల్లు కోటలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులతో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. జంగమయ్య దేవాలయం, కొండ మసీద్, ఖుష్మహల్, కీర్తితోరణాల ప్రాంగణం తదితర చారిత్రక కట్టడాల మీదుగా వాక్ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓరుగల్లు కోట చారిత్రక విశిష్టత, నిర్మాణ శైలి గురించి వివరించారు. వారసత్వ సంపద పరిరక్షించే బాధ్యత కేంద్ర పురావస్తు శాఖ అధికారులతో పాటు అందరిపై ఉందన్నారు. దేశ, విదేశీ పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తకుండా చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయవద్దన్నారు.