నల్లబెల్లి, జూన్ 27 : హెలెన్ కెల్లర్(Helen Keller )స్ఫూర్తితో దివ్యాంగులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని ఎన్పిఅర్డి ఇండియా జిల్లా అధ్యక్షుడు అడ్డ రాజు అన్నారు. నల్లబెల్లి గ్రామ పంచాయితీ ఆవరణలో హెలెన్ కెల్లర్ 145వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ ఇండియా వరంగల్ జిల్లా అధ్యక్షుడు అడ్డ రాజు మాట్లాడుతూ హెలెన్ కెల్లర్ చిన్న వయసులోనే చూపుతో పాటు వినికిడి కోల్పోయినప్పటికీ ఆధైర్యపడకుండా 35 దేశాలు పర్యటించి దివ్యాంగుల హక్కులకోసం చైతన్య కార్యక్రమాలు నిర్వహించారన్నారు.
అనేక అంశాలపై 14 పుస్తకాలు, వేలాది వ్యాసాలు రచించిన హెలెన్ కెల్లర్ దివ్యాంగుల పక్షపాతిగాగానే కాకుండా జీవితాంతం కార్మిక హక్కులు, మహిళా హక్కులతో పాటు ప్రపంచ శాంతి కోసం కృషి చేశారని ప్రశంసించారు. ఆమె జీవితాన్ని ప్రతి దివ్యాంగుడు ప్రేరణగా తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం హెలెన్ కెల్లర్ జయంతిని అధికారింగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో అణగారిన వర్గాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు పరికి కొర్నేలు, ఎన్పీఆర్డీ ఇండియా నాయకులు వైనాల శ్రీనివాస్, దయాకర్, నాగరాజు పాల్గొన్నారు.