దంచికొట్టిన వానతో ఉమ్మడి జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మానుకోట జిల్లా అతలాకుతలమైంది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రోడ్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. ఆకేరు వాగులో కారు కొట్టుకుపోయి తండ్రీకూతురు గల్లంతు కాగా, కూతురు మృతదేహం లభ్యమైంది.
చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతయ్యారు. పలు ఇళ్లు కూలిపోగా, భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వేలాది ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. వరద ధాటికి మహబూబాబాద్ జిల్లాలో మూడు చోట్ల రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. పట్టాలు తీగల వంతెనలా వేలాడుతున్నాయి. ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోవడంతో ప్రయా ణికులు ఆకలితో అలమటించారు.
– మహబూబాబాద్/వరంగల్ (నమస్తే తెలంగాణ)/నమస్తే నెట్వర్క్, ఆగస్టు 1
ఏకధాటిగా కురిసిన వర్షంతో మానుకోట జిల్లాలో జనజీవనం స్తంభించడంతోపాటు రైలు, రోడ్డు మార్గాలన్నీ పూర్తిగా బందయ్యాయి. జిల్లాకేంద్రంతోపాటు అన్ని మండలాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. పలు చెరువులకు గండ్లు పడి వేలాది ఎకరాల్లో పంట మునిగింది. కేసముద్రం మండలం ఇంటికన్నె వద్ద రెండు చోట్ల రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.
వరద ఉధృతికి పట్టాల కింద ఉండే సిమెంటు దిమ్మెలు, కంకర, మట్టి మొత్తం కొట్టుకుపోయింది. మహబూబాబాద్-తాళ్లపూసలపల్లి మధ్య ట్రాక్ మొత్తం ధ్వంసమైంది. దీంతో కేసముద్రంలో బెంగళూరు-దానాపూర్, దానాపూర్-బెంగళూరుకు వెళ్లాల్సిన సంఘమిత్ర, మహబూబాబాద్‌లో మచిలీపట్నం-సికింద్రాబాద్, సింహపురి, డోర్నకల్‌లో గౌతమి ఎక్స్‌ప్రెస్, పద్మావతి రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికులతోపాటు పలు వ్యాపార వాణిజ్య సంస్థలు, కుల సంఘా లు ఆహారాన్ని తీసుకొచ్చి ప్రయాణికులకు అందించారు.
మచిలీప ట్నం రైలులో సికింద్రాబాద్ వెళ్తున్న ఏపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఫోన్ చేయగా, మానుకోట మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డిని పంపించారు. ఎమ్మెల్యేను చైర్మన్ ఇంటికి తీసుకెళ్లి అనంతరం రైలులో పంపించారు. నెల్లికుదురు, మండలం రావిరాల గ్రామంలో ఇండ్లలో నడుంలోతు నీళ్లు చేరడంతో రాత్రంతా గ్రామంలోని ప్రజలందరు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. వరద ఉధృతికి 36 గొర్లు కొట్టుకుపోయాయి.
గణపురం మండలంలోని అప్పయ్యపల్లి, వెల్తుర్లపల్లి గ్రామాల మధ్యఉన్న మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగవతలి గ్రామాల ప్రజల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయింది. కాటారం మండలంలోని ఒడిపిలవంచ-గూడూర్ మధ్యలో బండల వాగు, మల్లారం అలుగువాగు భారీ వర్షానికి పొంగిపొర్లడంతో కొన్ని గంటల పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ములుగు మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామమైన అంకన్నగూడెం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఏటూరునాగారం మండలం భూటారం గ్రామానికి చెందిన గిరిజనులను ముందస్తుగా గిరిజనభవన్లోని పునరావాస కేంద్రానికి ఆదివారం తరలించారు. గోవిందరావుపేట మండలం దయ్యాల వాగు సమీపంలోని కాలనీ వాసులను ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పునరావాస కేంద్రానికి తరలించారు.
రఘునాథపల్లి మండల కేంద్రంలో వరంగల్-హైదరాబాద్ హైవేపై వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు నిలిచిపోయాయి. జనగామ-హుస్నాబాద్ మార్గంలో జనగామ మండలం వడ్లకొండ రోడ్డు కల్వర్టు నిర్మిస్తున్న తాత్కాలిక కాజ్వే కొట్టుకుపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రంగప్పచెరువు మత్తడి నీరు జనగామ పట్టణంలోని పలు కాలనీలను ముంచెత్తి జనగామ-హైదరాబాద్ ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేవరుప్పుల మండలం కడవెండిలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో దాదాపు 120 గొర్రెలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
పలు కాలనీలు ముంపునకుగురై నగరమంతా మునిగింది. దీంతో అధికార యత్రాంగం అప్రమత్తమైంది. నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే, మేయర్, కలెక్టర్, కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. సత్వర సహాయక చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రెస్క్యూ టీమ్‌లు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వరద బాధితులకు సహాయక చర్యలు అందించడానికి బల్దియా ఆధ్వర్యంలో 25 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రధానంగా ముంపు ప్రభావంతో చిక్కుకున్న 6 ప్రాంతాల్లో బాధితులకు ఆశ్రయం కల్పించారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి ప్రయాణికులతో బయల్దేరిన ఓ ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి 10 గంటల సమయంలో నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామం వద్ద రెండు లోలెవల్ కాజువేల నడుమ చిక్కుకుంది. రెండువైపులా బస్సు దాటే అవకాశం లేకపోవడంతో ఆదివారం ఉదయం అధికారులు ప్రత్యేకంగా ఒక లారీ ద్వారా బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు చేర్చారు. నెక్కొండలో భోజనం సమకూర్చి ప్రత్యేక బస్సు ద్వారా వీరిని వరంగల్ నగరానికి పంపారు.
పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సు వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో మరో నాలుగు రోజుల పాటు సందర్శన నిలిపివేశారు. పర్యాటకులు లక్నవరం వెళ్లకుండా బుస్సాపురం చెక్‌పోస్టు వద్ద బారికేడ్లు ఏర్పా టు చేశారు. అదేవిధంగా బొగత వద్ద వరద ఉధృతి నేపథ్యంలో జలపాతం సందర్శనను అటవీశాఖ అధికారులు బంద్ చేశారు. అలాగే వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో ని రామప్ప దేవాలయాన్ని పురావస్తు శాఖ అధికారులు మూసివేశారు.
భారీ వరదల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్‌కారేపల్లి గంగారంతండాకు చెందిన నూనావత్ మోతీలాల్ కూతురు అశ్విని కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌లో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నది. ఆమెను రాయచూర్‌కు పంపించేందుకు కారులో తండ్రీకూతుళ్లు హైదరాబాద్‌లోని విమానాశ్రయానికి బయలుదేరారు. డోర్నకల్, కురవి మీదుగా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడేనికి చేరుకున్నారు. అక్కడ బ్రిడ్జి పైనుంచి వెళ్తుండగా కారు కొట్టుకుపోయి తండ్రీ కూతురు వాగులో గల్లంతయ్యారు.
పోలీసులు గాలించగా అశ్విని మృతదేహం లభ్యమైంది. మోతీలాల్ కోసం గాలిస్తున్నారు. అదేవిధంగా తొర్రూరు మండలం వెంకటాపురంలో చేపల వేటకు వెళ్లిన నర్సయ్య గల్లంతయ్యాడు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలో జెర్రిపోతుల మల్లికార్జున్ (38) పశువులను మేతకు తీసుకువెళ్లి వెంగమాంబ చెరువు మత్తడి కాల్వను దాటేందుకు ప్రయత్నిస్తూ వరదలో కొట్టుకుపో యి మృతి చెందాడు. దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామం వద్ద వరద నీటిలో స్థానికులు వృద్ధురాలు కొండ్రు సమ్మక్క మృతదేహాన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు.
మందపల్లికి చెందిన ఈమె కల్వర్టులో పడి చనిపోయి ఉంటుందని వారు భావిస్తున్నారు. పరకాల పరిధిలోని రాజీపేట గ్రామానికి చెందిన గువ్వ రాములు (58) శుక్రవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. మహబూబాబాద్ మండల శివారులోని ఈదులపూ సపల్లి రోడ్డులో ఉన్న రాళ్లవాగులో డీసీఎం వ్యాన్ గల్లంతు కాగా, అందులో ఉన్న ఐదుగురు వ్యక్తుల్లో ముగ్గురు వ్యాన్‌ను, ఇద్దరు చెట్లను పట్టుకొని ఉన్నారు. ఈక్రమంలో అక్కడి చేరుకున్న రెస్క్యూ టీం వారిని కాపాడడానికి తాళ్లు వేయగా, ఒకరు పట్టు కుని వస్తున్న క్రమంలోనే జారిపోయి గల్లంతయ్యాడు. మిగతా నలుగురిని ఎన్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది.