నమస్తే నెట్వర్క్, ఆగస్టు 16 : ఉమ్మడి వరంగల్‌లోని ములుగు, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగడంతో వాటి పరీవాహక ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. లోలెవల్ కాజ్‌వేలు, రోడ్లపై నుంచి వరద ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ఇండ్లలోకి నీరు చేరింది. జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరగా, పలు చెరువులు, కుంటలు మత్తడి పడుతున్నాయి. ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి శివారు రాళ్లవాగు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టిరోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ములుగు జిల్లా కేంద్రంతో పాటు గోవిందరావుపేట మండలం పస్రాలో జాతీయరహదారిపైకి వర్షపు నీరు భారీగా చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఏటూరునాగారం మండలంలో జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహించడంతో దొడ్ల, కొండాయి, ఎలిశెట్టిపల్లి తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, ఎప్పుడు ముంపు ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పస్రా-మేడారం మధ్యలోని లోలెవల్ కాజ్‌వేలు, కల్వర్టుల వద్ద వరద ఉధృతి అధికంగా ఉండడంతో రాకపోకాలను అధికారులు నిలిపివేసి తాడ్వాయి మీదుగా కొనసాగిస్తున్నారు. అలాగే మేడారంలోని జంపన్నవాగు జంట వంతెనలను తాకుతూ ప్రవహిస్తుండడంతో అక్కడ గజ ఈతగాళ్లను మోహరించారు. అక్కడ పరిస్థితిని డీఎస్పీ రవీందర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. మంగపేట మండలంలో వరద ఉధృతికి పొలాల్లో ఇసుక మేట వేయగా, కమలాపూర్ గ్రామంలోని ఒడిస్సా కాలనీలో ఓ ఇంటి గోడ కూలింది. కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో కావిరి సుధాకర్‌కు చెందిన పెంకుటిల్లు కూలిపోయింది. కాగా, తాడ్వాయి మండలంలోని మేడారం, కొత్తూరు, ఊరట్టం, రెడ్డిగూడెం గ్రామాల్లో బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వరంగల్ జిల్లా నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, ఖానాపురం, సంగెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం, భూపాలపల్లి, కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, బయ్యారం, కొత్తగూడ, చిన్నగూడూరు తదితర మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు, వాహనదారులు వరదతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్ జిల్లాలోని జిన్నలవాగు ఉధృతికి చిన్నగూడూరు-నర్సింహులపేట, ఇల్లందు-మహబూబాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నర్సింహులపేట మండలం మంగిమడుగు శివారు ఎంకమ్మ చెరువు కట్ట తెగిపోవడంతో నీరంతా వృథాగా పోతున్నది.
గతేడాది కురిసిన వర్షాలకు ఆకేరువాగుపై నిర్మించిన చెక్‌డ్యాం కొట్టుకుపోగా ఇప్పటికీ మరమ్మతు చేయకపోవడంతో నీరంతా కిందికిపోతున్నది. అలాగే నిర్మల్ పట్టణానికి చెందిన బాస లక్ష్మీనారాయణ కుటుంబం కారులో భద్రాచలం వెళ్తూ వరంగల్ జిల్లా ఖానాపురం మండలం చిలుకమ్మనగర్ వద్ద వరద నీటిలో చిక్కుకుంది. వెంటనే వారు 100కు డయల్ చేయగా, దుగ్గొండి సీఐ సాయిరమణ తన సిబ్బందితో వెళ్లి వారిని రక్షించారు. వరంగల్, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్లు సత్యశారద, రాహుల్ శర్మతో పాటు ఇతర జిల్లాల్లోని ఉన్నతాధికారులు, పోలీసులు లోలెవల్ కాజ్‌వేలు, రోడ్లపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద ప్రాంతాల్లో పర్యటించారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా రాకపోకలను నియంత్రించారు.