హనుమకొండ, జూలై 29: భారీ వర్షాలకు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రూ. 414కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. శనివారం మండలి చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యేలు అరూరి, పెద్ది, నన్నపునేని, చల్లా, మేయర్ సుధారాణి, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్యతో కలిసి హనుమకొండ కలెక్టరేట్లో రెండు జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు తగ్గినా ఇంకా ముప్పు తొలగిపోలేదని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నష్టంపై వీలైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికలు అందజేయాలన్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రజలకు ఆపద సమయంలో బురద రాజకీయాలు చేయకుండా వరద బాధితులను ఆదుకోవాలని హితవు పలికారు. చీఫ్‌విప్ దాస్యం మాట్లాడుతూ.. రూ. 150కోట్లతో భద్రకాళి బండ్, రూ.17 కోట్లతో వడ్డేపల్లి బండ్‌ను పటిష్టం చేస్తామని, అలాగే నాలాల నిర్మాణం, మరమ్మతులకు రూ. 75 కోట్లు అవసమవుతాయని అంచనా వేసినట్లు చెప్పారు.
కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు హనుమకొండ, వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు రూ.414కోట్ల వరద నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. శనివారం మంత్రి పలు చోట్ల వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. భద్రకాళి చెరువు కట్ట తెగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. వడ్డేపల్లి చెరువును కూడా సందర్శించారు. సాయంత్రం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండు జిల్లాల్లో వరద నష్టంపై శాసన మం డలి చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు, మేయర్, కుడా చైర్మన్, రెండు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా హనుమకొండ, వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో శాఖల వారీగా జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకొని, తాత్కాలిక పనులు త్వరగా చేపట్టాలని, ఇంకా పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసి, అందజేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్, ఫైర్, ఇతర శాఖల అధికారులను సత్కరించి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి విలేకర్లతో మాట్లాడుతూ ఏళ్లలో ఎన్నడూ చూడనంత వర్షం ఈ సారి కురిసిందన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో 14 సెం.మీ. వర్షపాతం నమోదైందన్నారు.
గ్రేటర్ పరిధిలో రూ.177 కోట్ల నష్టం జరిగిందని మంత్రి తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడంతో నష్టం తగ్గిందన్నారు. ముఖ్యంగా నీట మునిగిన కాలనీల ప్రజలను రక్షించడంలో ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్, ఫైర్, రెవెన్యూ, పోలీసుతో పాటు ఇతర శాఖల అధికారులు చాలా కష్టపడ్డారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు వరదలపై సమీక్షించి, మమ్మల్ని అలర్ట్ చేశారన్నారు. అడుగగానే హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయని, ఇక ప్రజల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా నాలా లు, డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త చెదారంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వాటిని తొలగించాలన్నా రు. పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అదే విధంగా తాగునీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇంత భారీగా వర్షం పడినా మిషన్ కాకతీయ వల్ల ఎక్కు వ శాతం చెరువులు తెగిపోలేదన్నారు. చెరువుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ల నేతృత్వంలో అధికారులంతా కలిసికట్టుగా పని చేయాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారులతో క్షేత్ర స్థాయిలో సందర్శించాలని మంత్రి సూచించారు.
వరద నష్టం ప్రాథమిక అంచనా
భారీ వర్షాలకు హనుమకొండ, వరంగల్ జిల్లాలో రూ. 414 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచ నా వేసినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఇందులో వరంగల్ జిల్లాలో రూ. 89 కోట్లు, హనుమకొండ జిల్లాలో రూ.146 కోట్లు, గ్రేటర్ పరిధిలో రూ.179 కోట్లుగా నిర్ధారించినట్లు వివరించారు. వరంగల్ జిల్లాలో 7, హనుమకొండ జిల్లాలో 4, కార్పొరేషన్ పరిధిలో 25 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. మొత్తం 4,668 మందికి సహాయం అందించామన్నారు. 38 రెస్యూ టీమ్‌ల ద్వారా 2,055 మందిని రక్షించామన్నారు. 207 ఇండ్లు పూర్తిగా, 480 ఇండ్లు పాక్షింగా దెబ్బతిన్నాయన్నారు. గతంలో శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన రూ.300 కోట్ల విలువైన పనుల వల్ల భారీ నష్టం తప్పిందన్నారు. బాధితులకు త్వరలోనే పరిహారం అందించేలా సీఎం కేసీఆర్‌తో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.
ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయొద్దు
వరదలను కూడా రాజకీయాలకు వాడుకోవద్దని, చేతనైతే బాధితులకు సాయంగా నిలువాలని ప్రతిపక్ష పార్టీలకు మంత్రి ఎర్రబెల్లి హితవు పలికారు. వరద బాధితులకు అండగా నిలువాల్సిన సమయంలో కొందరు రాజకీయం చేస్తున్నారని, అలాంటి చర్యలకు పాల్పడవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
అప్రమత్తత వల్లే నష్ట నివారణ
అప్రమత్తత వల్లనే అధిక నష్టాన్ని నివారించామని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ముందస్తు చర్య ల్లో భాగంగా ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీశ్రేణులు సమన్వయంతో పనిచేయడం అభినందనీయమన్నారు. గతంలో కురిసిన వర్షాలకు సమ్మయ్యనగర్, అమరావతి నగర్, నయీంనగర్, టీవీ టవర్ కాలనీలో వరదలు భారీగా వచ్చేదన్నారు. వరద నివారణ చర్యలతో ఆయా ప్రాంతాలు నీట మునగలేదన్నారు. లోతట్టు ప్రాంతాలైన రాజాజీనగర్, రాంనగర్, పోతన నగర్, కాకతీయ కాలనీ లాంటి కొన్ని ప్రాంతాలు వరద నీటి ప్రభావం ఉందన్నారు. భద్రకాళి కట్ట తెగలేదని, తూము వద్ద పురాతన మట్టికట్ట కొట్టుకు పోవడంతో అప్రమత్తమై వెంటనే పూడ్చివేసినట్లు తెలిపారు. భద్రకాళి కట్టను పకడ్బందీగా నిర్మించేందుకు రూ.150 కోట్లు, వడ్డేపల్లి చెరువు పటిష్టతకు రూ.15 కోట్లు, నాలాల నిర్మాణాననికి రూ.75 కోట్లతో అధికారులు అంచనా వేశారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల పరిధిలో జరిగిన నష్టం గురించి మంత్రికి తెలియజేసి, బాధితులను ఆదుకోవాలని కోరారు. సమీక్షలో నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, సీపీ రంగనాథ్, గ్రేటర్ కమిషనర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరుతూమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్ విప్ వినయ్‌భాస్కర్‌కు వరంగల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు వినతి ప్రతం అందజేశారు.