వరంగల్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షం జిల్లాను అతలాకుతలం చేసింది. గ్రామాలు, కాలనీలను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద చేరింది. బాధితులు పునరావాస కేంద్రాలకు చేరారు. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వాగులు, ఒర్రెలు పొంగి ప్రవహిస్తున్నాయి. కాజ్‌వేలు, వంతెనల మీదుగా వరద ప్రవహిస్తుండటంతో పలు రూట్లలో రాకపోకలు నిలిచాయి. రహదారులు కోతకు గురయ్యాయి. కుండపోత వర్షంతో జన జీవనం స్తంభించింది.
జిల్లాలో 1,963 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. సగటున 151 మిల్లీమీటర్లు కురిసింది. నెక్కొండ మండలాల్లో అత్యధికంగా పర్వతగిరిలో 294.8, నెక్కొండలో 246.4 మిల్లీమీటర్లు నమోదైంది. చెన్నారావుపేటలో 196.2, రాయపర్తిలో 192, వర్ధన్నపేటలో 185.8, వరంగల్‌లో 120, గీసుగొండలో 105.4, దుగ్గొండిలో 106.4, నల్లబెల్లిలో నర్సంపేటలో 114.8, ఖానాపురంలో 112.2, సంగెంలో 112.2, ఖిలావరంగల్‌లో 94 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది.
జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. నర్సంపేట నుంచి నెక్కొండ, మహబూబాబాద్, కొత్తగూడ వంటి ప్రధాన రూట్లలో రాకపోకలు స్తంభించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి ప్రయాణీకులతో బయల్దేరిన ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి 10గంటలకు మార్గమధ్యలోని నెక్కొండ మండలం వెంకటాపురం వద్ద రెండు లోలెవల్ కాజ్‌వేల నడుమ చిక్కుకుంది.
రెండువైపులా బస్సు దాటే అవకాశం లేకపోవటంతో ఆదివారం ఉదయం అధికారులు ప్రత్యేకంగా ఒక లారీ ద్వారా బస్సులో ఉన్న 45 మంది ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. నెక్కొండలో భోజనం సమకూర్చి ప్రత్యేక బస్సు ద్వారీ వీరిని వరంగల్ నగరానికి పంపారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా, కలెక్టర్ సత్యశారద నెక్కొండ పోలీసు స్టేషన్ నుంచి ఈ సహాయక చర్యలను పర్యవేక్షించారు.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఒకరు మృతిచెందగా, ఇద్దరు గాయపడ్డారు. దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద నీటిలో ఆదివారం ఉదయం స్థానికులు వృద్ధురాలు కొండ్రు సమ్మక్క మృతదేహాన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. సమీపంలోని మందపల్లికి చెందిన ఈమె కల్వర్టులో పడి చనిపోయి ఉంటుందని అధికారులు రాయపర్తి మండలం కాట్రపల్లిలలో ఆదివారం ఇంటి గోడ కూలి మీద పడి ఇద్దరు గాయపడ్డారు.
కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, మేయర్ సుధారాణి వరంగల్ నగరంలో ముంపునకు గురై నీటిలో ఉన్న వివిధ కాలనీలు సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు. నీటమునిగిన కాలనీల ప్రజలకు ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబర్ 18004253434, సెల్ నంబర్ 9154252936ను సంప్రదించాలని సూచించారు. డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీములు, బోట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వరంగల్ నగరంలోని పలు కాలనీల్లోకి నీరు చేరటం, వరద ప్రవాహంతో రహదారులపై రాకపోకలకు బ్రేక్‌పడింది. అండర్‌బ్రిడ్జి వద్ద స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఖానాపురం మండలం పాకాల సరస్సు ఈ ఏడాది మరోసారి అలుగుపోస్తోంది. జిల్లాలో 816 చెరువులు ఉండగా వీటిలో 408 నిండి అలుగు పోస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. 353 చెరువుల్లోకి 75 నుంచి 100 శాతం, 39 చెరువుల్లోకి 50 నుంచి 75 శాతం, చెరువుల్లోకి 25శాతం నీరు చేరిందని సమాచారం అందినట్లు తెలిపారు. వరద ఉధృతితో చెన్నారావుపేట మండలం అమీనాబాద్, కోనాపురంలోని నాలుగు చెరువులకు, నెక్కొండ మండల కేంద్రంలోని పెద్దచెరువు, రాయపర్తి మండల కేంద్రంలోని రామచంద్రుడిచెరువు మత్తడి వద్ద, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని కోనారెడ్డి చెరువుకు బుంగలు పడినట్లు అధికారుల దృష్టికి వచ్చింది.