వరంగల్, జూలై 1 : వరంగల్ నగరంలో వర్షం దంచికొట్టింది. మంగళవారం ఉదయం నుంచి ఆకాశం మేఘాలతో ఉంది. చిరు జల్లులు పడ్డాయి. రాత్రి ఒక్కసారిగా జోరువాన కురవడంతో హనుమకొండ బస్ స్టేషన్ రోడ్డు, కాకాజీ కాలనీ, అంబేద్కర్ భవన్ ప్రాంతాల్లో రహదారులపైకి వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ హెడ్ పోస్టాఫీస్, సీకేఎం ఆస్పత్రి రోడ్డు, వరంగల్ చౌరస్తా, పాత బీట్‌బజార్ ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. అనేక కాలనీల్లోని అంతర్గత రోడ్లపైకి, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు భయం భయంగా వెళ్లారు. రెండు రోజులుగా రాత్రి సమయంలో మోస్తరు వర్షం పడుతుండడంతో ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు.
మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతున్నది. సోమవారం ఇన్‌ఫ్లో 8,400 క్యూసెకులుండగా, ఎగువన కురుస్తున్న వర్షాలతో మంగళవారం 12,500 క్యూసెకులకు పెరిగింది. దీంతో బరాజ్ 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరదను దిగువకు వదులుతున్నారు. కాగా, బరాజ్‌లో వరద పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరీవాహక గ్రామాలైన అంబట్పల్లి, పెద్దంపేట, లెంకలగడ్డతో ఇతర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జాలర్లు, ఇతరులు ఎవరూ నది వద్దకు వెళ్లొద్దని సూచించారు.