మహదేవపూర్ (కాళేశ్వరం), ఆగస్టు 28: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్‌కు ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గురువారం 4,51,940 క్యూసెకుల ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
బరాజ్ వద్ద ప్రస్తుత ప్రవాహం బరాజ్ రివర్ బెడ్ నుండి సముద్ర మట్టానికి 93.70 మీటర్ల ఎత్తులో ఉందని భారీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా మండల పరిధిలోని కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం గోదావరి వద్ద సుమారు 5.7 మీటర్ల ఎత్తులో వరద ప్రవాహం ఉందని అధికారులు తెలిపారు. వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.