కురవి, మే 3: తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకున్నాడు సీరోలు మండ లం కాంపల్లి శివారు బీల్యానాయక్ తండావాసి డాక్టర్ బానోత్ నెహ్రూనాయక్-అనిత దంపతుల కుమారుడు డాక్టర్ బానోత్ కార్తీక్నాయక్. మొదటి ప్రయత్నంలోనే గుండె స్పెషలిస్టు కోర్సు ఉత్తీర్ణత సాధించాడు. బీల్యానాయక్ తండా నుంచి తండ్రి బానోత్ నెహ్రూనాయక్ ఎంబీబీఎస్, డీసీహెచ్ చదివి మహబూబాబాద్ ప్రభుత్వ వైద్యశాలకు మొదటి సూపరింటెండెంట్‌గా పనిచేశాడు. అత డి స్ఫూర్తితో ఎందరో డాక్టర్ వృత్తిని ఎంచుకున్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ తండ్రికితగ్గ తనయుడిగా కార్తీక్నాయక్ ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేశాడు.
ఇంకా ఉన్నత చదువులు చదవాలనే కాంక్షతో మూ డేళ్ల పాటు గుండె స్పెషలిస్టు కోర్సు పూర్తి చేశా డు. కుటుంబానికి దూరంగా ఉండి కోర్సు పరీక్షలో మొదటి అటెంప్ట్‌లోనే ఉత్తీర్ణత సాధించి తండా నుంచి మొదటి గుండె వ్యాధుల సూపర్స్పెషలిస్టుగా ఎదిగాడు. గుండె స్పెషలిస్టుగా ఎదిగిన డాక్టర్ బానోత్ కార్తీక్నాయక్ను తల్లిదండ్రులు నెహ్రూనాయక్-అనిత, మహబూబాబాద్‌లోని వైద్యులు, బిల్యానాయక్ తండావాసులు అభినందించారు. హస్తవాసిలో నెహ్రూనాయక్‌కు మహబూబాబాద్ జిల్లాలో మంచి పేరు ఉంది. తండ్రికి తగిన కొడుకుగా కార్తీక్నాయక్ పేరు తెచ్చుకోవాలని పలువురు ఆశీర్వదించారు.