నర్సంపేట రూరల్, సెప్టెంబర్19 : రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్యరంగాలకు పెద్దపీట వేసిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం నర్సంపేటలో నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ, సమాచార, పౌర సంబంధాలు, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ ఏ ప్రభుత్వానికైనా మొదటి ప్రాధాన్యంగా విద్య, వైద్యం అయి ఉండాలని, అవి అమలుచేసే దిశగా రేవంత్ సర్కారు నిరంతరం కృషి చేస్తుందన్నారు.
రూ.183 కోట్ల నిర్మాణ వ్యయంతో నర్సంపేట వైద్య కళాశాలను, రూ.66కోట్ల నిధులతో జనరల్ ఆస్పత్రిని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం 50 సీట్లతో ఈ ప్రాంతవాసులు వైద్యసేవలకు సంపూర్ణంగా వినియోగించుకునేలాగా అందుబాటులోకి తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లావాసులు అత్యవసర సమయంలో హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా అత్యాధునిక ఆంబులెన్స్‌లు, ట్రామా సెంటర్లు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్, ఐవీఎఫ్ సెంటర్, పీడీయాట్రీక్ సెంటర్, క్యాన్సర్ సెంటర్ లాంటి సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలన్నీ రానున్న రోజుల్లో అందుబాటులోకి తీసుకొచ్చి వరంగల్‌ను హెల్త్‌హబ్‌గా మారుస్తామని తెలిపారు. త్వరలో వరంగల్‌లో రూ.30కోట్లతో క్యాన్సర్ ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే 7వేల మందికి నర్సింగ్ పోస్టులు ఇచ్చి త్వరలో ఇంకో 2500మందికి పోస్టింగ్ ఇచ్చే దిశగా నోటిఫికేషన్‌ను విడుదల చేశామన్నారు. ఈ సందర్భంగా వైద్య కళాశాలలోని అన్ని విభాగాలను, బ్లాక్‌లను, బ్లడ్‌బ్యాంక్, సెంట్రల్ ల్యాబ్‌లను వారు పరిశీలించి ఆవరణలో మొక్కలు నాటారు.
నర్సంపేట మెడికల్ కళాశాల తరగతులు త్వరలో ప్రారంభమవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనివి కూడా అమలుచేస్తామని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసి సుమారు రూ.657 కోట్లను ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. రూ.100 కోట్లతో 25ఎకరాల్లో అన్ని కులాలు, అన్ని వర్గాలకు సంబంధించిన హాస్టల్స్, స్కూల్స్ ఉండేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేవలం 27రోజుల్లో 23లక్షల మందికి రూ.18వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని, సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ ప్రయోజనం అందలేదని, వీలైనంత త్వరలో వాటిని పరిష్కరించి ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతీ రైతన్నకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.31వేల కోట్ల రూపాయలకు ఇంకా కావాలంటే రూ.300కోట్లు ఎక్కువైనా పర్వాలేదని అర్హులైన రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని స్పష్టంచేశారు. అలాగే అర్హులైన ప్రతీ ఒక్కరికీ హెల్త్‌కార్డులు, రేషన్‌కార్డులు వేర్వేరుగా ఇస్తామని, త్వరలో ఇందిరమ్మ ఇండ్లకు కూడా ముగ్గు పోస్తామని మంత్రి ప్రకటించారు.
నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రభుత్వం కృషిచేస్తుందని, మారుమూల ప్రాంతంలో వైద్య కళాశాలను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. మహిళలను ఆర్థిక, సాధికారతతో ముందుకు తీసుకువెళ్తున్న ఘనత ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. ఖమ్మం నుంచి కూడా వైద్య సదుపాయాల కోసం వరంగల్ ఎంజీఎం దవాఖానకు వస్తున్నారని పేర్కొన్నారు. నర్సంపేట కొత్త ఆస్పత్రిని ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించడం వల్ల రోగులకు మనశ్శాంతిగాతో పాటు వ్యాధి నుంచి కోలుకునే శక్తి కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు. అనంతరం మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచందర్‌నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, మహబూబాబాద్, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేలు మురళీనాయక్, కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్ పాల్గొన్నారు.
మెడికల్ కళాశాలలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీ న్, జిరాక్స్, స్టేషనరీ, జనరల్ స్టోర్స్‌లను మంత్రులు ప్రారంభించారు. 15 స్వయం సహాయక సంఘాలకు రూ.2 కోట్ల విలువైన చెక్కులు అందజేశారు. రాజుపేట శివారు నర్సంపేట-కొత్తగూడ ప్రధాన రహదారిలో రూ.2కోట్లతో బంజారా భవన్, అమృత్ పథకంలో భాగంగా రూ.31కోట్లతో వాటర్‌ట్యాంక్, అంతర్గత పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, అగ్రికల్చర్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, కలెక్టర్ సత్యశారద, డీఎంఈ వాణి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో కృష్ణవేణి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌దాస్, వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ పి.రవిందర్, డీఎంఅండ్‌హెచ్‌వో వెంకటరమణ, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్‌రావు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, జడ్పీ సీఈవో రాంరెడ్డి, టీజీఎంఐడీసీ ఈఈ ప్రసాద్, తహసీల్దార్ రాజేశ్, మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజిని-కిషన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రకాశ్, నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.కిషన్, నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ ఉన్నారు.