నర్సంపేటరూరల్/నర్సంపేట, సెప్టెంబర్ 27: నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతులమీదుగా గురువారం శంకుస్థాపన జరుగనుంది. నేడు జరుగనున్న కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి హాజరుకానున్నారు. ఈ మేరకు నర్సంపేట పట్టణం సర్వాపురం శివారు నర్సంపేట-కొత్తగూడ ప్రధాన రహదారిలోని దామెర చెరువు సమీపంలో జిల్లా దవాఖాన ఆవరణంలో శిలాఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించనున్నారు. అనంతరం నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో జరిగే బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ముగ్గురు మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లాస్థాయి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలను బహిరంగ సభకు పెద్ద మొత్తంలో తరలించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు చర్యలు చేపట్టారు. కార్యకర్తలు, నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మంత్రులకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఏర్పాట్ల పరిశీలన
సర్వాపురం శివారులో జిల్లాస్థాయి దవాఖాన భవన నిర్మాణం వద్ద జరుగుతున్న శిలాఫలకం ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. అదేవిధంగా జిల్లాస్థాయి ఆస్పత్రి నిర్మాణ పనులను కూడా పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ పి.రవీందర్, నర్సంపేట ఏసీపీ పుప్పాల తిరుమల్, ఏడీఏ తోట శ్రీనివాసరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ కాజీపేట వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రకాశ్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్, డాక్టర్ మనోజ్‌లాల్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, తహసీల్దార్ కే విశ్వప్రసాద్, నర్సంపేట టౌన్ సీఐ సుంకరి రవికుమార్, ఎస్సై శీలం రవి, మున్సిపల్ కమిషనర్ నాయిని వెంకటస్వామి పాల్గొన్నారు.
మార్కెట్ ఆవరణలో సభ
మంత్రి హరీశ్‌రావు పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. బుధవారం ఆమె బహిరంగ సభ స్థలం, హెలిప్యాడ్‌ను పరిశీలించారు. సభ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. మంత్రి ములుగు నుంచి హెలికాప్టర్ ద్వారా నర్సంపేటకు వచ్చి, అక్కడి నుంచి కాన్వయ్‌లో సర్వాపురం చేరుకొని మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. తర్వాత నర్సంపేట మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడుతారని వెల్లడించారు. కలెక్టర్ వెంట జడ్పీ ఫ్లోర్లీడ్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, ఏసీపీ తిరుమల్, మార్కెట్ కార్యదర్శి ప్రసాదరావు, ఏడీఏ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రి పర్యటన ఇలా..
నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో నిర్మించిన హెలిప్యాడ్‌లో మధ్యాహ్నం 12.40కు మంత్రి హరీశ్‌రావు చేరుకోనున్నారు. 12.45 గంటలకు మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఒంటిగంటకు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ఆవరణలో జరిగే సభలో ప్రసంగిస్తారు. సభ తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని భోజనం అనంతరం తిరిగి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు మరిపెడకు బయల్దేరనున్నారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు.