వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అతడో రౌడీ ‘రాజ్’. పోలీసు వ్యవస్థను శాసిస్తూ, తన దందాలు, దౌర్జన్యాలకు పోలీసులనే ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటూ ‘నవీన’ పోలీసింగ్ నడిపిస్తున్నాడు. ఇక్కడ పోలీసులకు పోస్టింగ్ కావాలన్నా.. వారు డ్యూటీలు చేయాలన్నా అతడిని సంప్రదించాల్సిందే. అతడు చెప్పిన వారే ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఎస్సై విధుల్లో ఉంటారు. అతడు చెప్పిందే తడవుగా ‘జీ హుజూర్’ అంటూ వంగి సలాం కొడుతారు. అతడు సైగ చేస్తే దందాలు.. సెటిల్మెంట్లు చక్కబెడతారు.
ప్రత్యర్థులపై తప్పుడు కేసులు నమోదు చేస్తారు. అతడికి గాడ్ ఫాదర్‌గా ఉన్న వయోభారం, అనారోగ్యంతో జనాల్లో తిరగలేని ఓ అధికార పార్టీ ముఖ్యనేత. ఇదే రౌడీ రాజ్‌కు కలిసి వచ్చింది. పోలీసులను శాసిస్తూ శాంతి భద్రతల ను తన కంట్రోల్లోకి తె చ్చుకున్నాడు. ఇందుకు ఓ ఉన్నతాధికారి సహకారాలందిస్తుంటే ఇతరులు స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు. వీరిద్దరిపై ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు చేసినా, ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలు అందినా ఉన్నతాధికారుల చర్యలు శూన్యం. హోం శాఖను తన చేతిలో పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి కూడా పట్టించుకోకపోవడంతో వారి అరాచకాలు మరింత పెరిగిపోతున్నాయి.
– సుబేదారి, మే 24
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీ ముఖ్య నేతకు అనుచరుడిగా ఉంటున్న ఓ రౌడీ రాజ్ అరాచకాలు మితిమీరుతున్నాయి. సామాన్య ప్రజలపై దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. అయితే బాధితులకు అండగా నిలవాల్సిన, రాష్ట్ర పోలీసు శాఖ కంట్రోల్లో ఉండాల్సిన ఇక్కడి పోలీసులు అతడి కనుసన్నల్లో పనిచేస్తుండడంతో న్యాయం జరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది నెలల క్రితం తనకు సంబంధం లేకున్నా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు వెళ్లిన రౌడీ రాజ్‌కు ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఎదురెళ్లి సెల్యూట్ చేసి లోపలికి తీసుకురావడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. రౌడీ రాజ్‌కు సహకరిస్తున్న ఓ పోలీసు అధికారి అతడి వద్దకు వచ్చే బాధితులను ‘అన్న (రౌడీ రాజ్)ను కలిశారా? లేదంటే అతడిని కలిసి రండి.. అప్పుడు చూద్దాం’ అని చెప్తూ పోలీసు శాఖ పరువు తీస్తున్నాడనే ఆరోపణలున్నాయి.
కొట్టించడం.. కేసుల్లో ఇరికించడం..
తూర్పు నియోజవర్గంలో రౌడీ రాజ్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. పోలీసులకు పోస్టింగ్‌లు ఇప్పిస్తూ ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకునేందుకు వారితో కొట్టించడం, అప్పటికీ వినకపోతే కేసుల్లో ఇరికించడం చేస్తుంటాడు. వీరి అండతో వివాదాస్పద భూముల్లో తలదూర్చి అమాయక ప్రజల భూములను బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడనే ఆరోపణలు కోకొల్లలు. కొద్ది నెలల క్రితం వరంగల్ నగర శివారు స్తంభంపెల్లిలో రూ. 7 కోట్లకుపైగా విలువ చేసే మూడు ఎకరాల సాగు భూమిని బెదిరించి తన సొంతం చేసుకున్నట్లు తెలిసింది.
అలాగే వరంగల్ 34వ డివిజన్లో అరకోటికిపైగా విలువ చేసే ప్లాట్‌ను తన ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. మిల్స్‌కాలనీ, ఇంతెజార్గంజ్, మట్టెవాడ పోలీసు స్టేషన్ల పరిధిలో వివాదాస్పద భూములు, లావాదేవీలను అక్కడి పోలీసు అధికారులు సెటిల్ చేసి రౌడీ రాజ్‌కు ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్నారనే విమర్శలున్నాయి. అలాగే కొద్ది రోజుల క్రితం పోలీసులను అడ్డుపెట్టుకొని చాంబర్ ఆఫ్ కామర్స్ నేతను రౌడీ రాజ్ ఇబ్బందులకు గురిచేశాడు. ఇటీవల గొర్రెకుంటలో లారీ అసోషియేషన్ ఎన్నికల విషయంలో తలదూర్చి తన అనుచరుడిని అధ్యక్షుడిని చేసేందుకు పలువురు లారీ ఓనర్లపై దాడి చేయించగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇటీవల అధికార పార్టీ కి చెందిన కార్పొరేటర్‌ను రాజకీయ కక్షతో తప్పుడు కేసులో ఇరికించడంలో రౌడీ రాజ్ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిసింది. అయితే ఓ పోలీసు అధికారి డైరెక్షన్లోనే మూడు స్టేషన్ల అధికారులు రౌడీ రాజ్ దందాలకు సహకరిస్తూ స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో ఆ అధికారిపై విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపినా అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం.
గాడ్‌ఫాదర్ అండతో..
వరంగల్ తూర్పు నియోజవర్గంలో అధికార పార్టీ ముఖ్య నేత రౌడీ రా జ్‌కు గాడ్‌ఫాదర్‌గా ఉన్నాడు. అయితే కొద్ది నెలల క్రి తం ‘నమస్తే తెలంగాణ’లో అతడి వ్యవహారంపై వరు స కథనాలు ప్రచురితం కావడంతో గన్మెన్లను, తు పాకీ లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత కొంత కాలం సైలెంట్‌గా ఉన్న ఆ రౌడీ తన గాడ్ ఫాద ర్ అండ, పోలీసు అధికారి సహకారంతో మళ్లీ రెచ్చిపోతున్నాడు. ఇటీవలే తన ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించినట్లు ఆరోపణలుండగా వెలుగులోకి రాని భూ సెటిల్మెంట్లు, బెదిరింపులు అనేకం.
ఇంత జరుగుతున్నా ఆ రౌడీ దందాలు, దౌర్జన్యాలకు చెక్ పెట్టకపోవడం, అతడికి సహకరిస్తున్న పోలీసు అధికారిపై చర్యలు తీసుకోకపోవడంతో ఉన్నతాధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఆ రౌడీ దందాలు, అతడి వెనకున్న ముఖ్య నేతపై ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. తూర్పులో జరుగుతున్న పరిణామాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదికలు అందించినా హోం శాఖను చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల వరంగల్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సన్‌ప్రీత్ సింగ్ రౌడీ రాజ్ పోలీసింగ్‌కు చెక్‌పెట్టి, అదుపు తప్పిన శాంతిభద్రతలను కంట్రోల్లోకి తీసుకొస్తారా? అనేది వేచి చూడాలి.