‘తెలంగాణ రాకముందు మా ఊరికి.. ఇప్పుడున్న మా ఊరికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మా ఇంటికి నళ్లా నీళ్లు మస్తువస్తున్నయ్. అందరికీ పింఛన్ల వస్తున్నయ్.. కరంటు మంచిగ ఉంటాంది. రైతుల పొలాలు పచ్చగ ఉంటున్నయ్.. మా కొడుకు త్యాగం వట్టిగ పోలేదు’ అంటున్నరు అమరుడు కుమారస్వామి తల్లిదండ్రులు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు తమకు అండగా నిలిచిన తీరును వివరించారు.
హనుమకొండ సబర్బన్, జూన్ 26 : ఈ ఫొటోలో కనిపిస్తున్న దంపతుల పేరు పాలకుర్తి భిక్షపతి, రాజేశ్వరి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. గుంట భూమి, ఉండడానికి ఇల్లు కూడాసరిగా లేని ఈ కుటుంబం కేవలం కులవృత్తి అయిన కల్లు గీత పనినే నమ్ముకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో వీరి పెద్ద కొడుకు కుమారస్వామి ఇంటర్ పూర్తిచేసి పెద్ద చదవులకు స్థోమత లేక గ్రామంలోనే పనులు చేసుకుంటూ జీవించేవాడు.
2002 నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే వాడు. నిత్యం తెలంగాణ కోసం పలువురితో వాదనలు పెట్టుకునే వాడు. అ తరుణంలో ఉద్వేగానికి గురైన కుమార స్వామి 2010, మార్చి 6న తన చావుతోనైనా తెలంగాణ రావాలని సూసైడ్‌నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుమారస్వామి కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. ఆర్థిక సాయం చేసి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు. తమ కొడుకు త్యాగం.. బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో వచ్చిన అనేక మార్పులను ఆ దంపతులు చెప్పుకొచ్చారు.
కేసీఆర్ ఆదుకోకుంటే ఆగమైతుంటిమి
‘తెలంగాణ ఉద్యమంల మా కొడుకు రోజూ పాల్గొన్నడు.. ఒక్కోసారి తిండికి కూడా రాకపోవు. తిండికి కూడా లేని మనకు ఉద్యమాలెందుకురా? అని తిట్టినా ఊకోకపోయేది. తన చావుతోనన్న తెలంగాణ రావాలె అని మా కొడుకు మందు తాగి సచ్చిపోయిండు. తొలిసూరు బిడ్డ గిట్ల పోయిండని కుమిలికుమిలి ఏడ్చినం. ఉద్యమంల బిడ్డ ను పోగొట్టుకున్న మాకు అప్పటి ఉద్యమ సమాజం అండగ నిలిచింది. నమస్తే తెలంగాణ పేపరోళ్లు రూ.లక్ష, కరంటోళ్లు రూ.25వేలు, రెవెన్యూ ఉద్యోగుల సంఘపోళ్లు రూ.50 వేలు ఇచ్చిన్రు. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సారు ముఖ్యమంత్రి కాంగనే మాకు రూ.10 లక్షలు ఇచ్చిన్రు. ఆ పైసలతోటి మా బిడ్డ కల్యాణి పెండ్లి చేసినం. మా చిన్నకొడుకు రాజుకు నీటి పారుదల శాఖల అటెండర్ ఉద్యోగం ఇచ్చిన్రు. ఇప్పుడు ఆ నౌకరితోనే లోన్ తీసుకుని ఇల్లు సుత కట్టుకున్నం. మా చిన్నకొడుకు పెండ్లి సుత చేసినం.
ఆరోగ్యం మంచిగ లేక నేను తాళ్లు ఎక్కుత లేను. కేసీఆర్ సర్కారు ఆదుకోకుంటే మా బతుకు ఆగమైతండె. తెలంగాణ వచ్చిన తర్వాత ఊర్లో అందరికీ పింఛన్లు వస్తున్నయి. రైతులకు నీళ్లు, కరంటు మంచిగ వస్తున్నయ్. అంతకుమందు ఉన్న మా ఊరికి, గిప్పుడున్న మా ఊరికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మా ఇంటికి నళ్లా నీళ్లు మస్తుగస్తున్నయ్. తెలంగాణల శాన మందికి ఉద్యోగాలు వచ్చినయ్. గా పిలగాండ్లల్ల మా కొడుకును చూసుంటున్నం. రైతుల పచ్చని పంట పొలాలను చూస్తాంటె మా కొడుకు త్యాగం అందులో కనపడుతాంది. మావోని త్యాగం ఉట్టిగపోలేదు.’ అంటూ అమరుడు కుమార స్వామి తల్లిదండ్రులు వివరించారు.