వరంగల్, డిసెంబర్ 20: ప్రతి శుక్రవారం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని సీడీఎంఏ డాక్టర్ సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ నుంచి కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలోని నర్సరీలను సందర్శించాలని, మొక్కలు నాటడమే కాకుండా ట్రీగార్డులను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కనూ బతికించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
10 శాతం గ్రీన్ బడ్జెట్‌ను పచ్చదనానికి పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. టీఎస్ బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకుల కోసం స్వచ్ఛ సర్వేక్షణ్ పారమీటర్లను పూర్తిగా అమలు చేయాలన్నారు. బస్తీ దవాఖానలు, సమీకృత మార్కెట్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ కమిషనర్లు అనీసుర్ రషీద్, శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి విజయలక్ష్మి, సిటీ ప్లానర్ వెంకన్న, సీఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, బయలాజిస్ట్ మాధవరెడ్డి, ఈఈ సంజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.