హనుమకొండ చౌరస్తా, మే 22: చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో హనుమాన్ జయంతిని పురస్కరిం చుకొని ఆలయ ప్రాంగణంలో ప్రసన్నంజనేయస్వామి సన్నిధిలో జయంతి ఉత్సవం గణపతిపూజతో వైభవంగా నిర్వహించారు. స్వస్తివాచకం, అంకురారోపణ, మన్యసూక్త విధానంలో అభిషేకం, అర్చన సింధూర సేవ, నాగవెల్లి దళార్చన(తమలపాకులు), జిల్లేడుపూలు, లిల్లీపూల దండలతో అలంకరణ, మినప వడలతో, పూజలు నిర్వహించి, గణపతి, నవగ్రహ, రుద్రహోమాలు, మన్యసూక్త, పంచసూక్తములతో జయాధి కార్యక్రమాలు నిర్వర్తించి, యజ్ఞాలు(హోమాలు) పూర్ణాతి అనంతరం పంచముఖ ఆంజనేయస్వామికి వందలాది భక్తులు పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో భరత్భూషణ దంపతులు, సీఎంఆర్ షాపింగ్‌మాల్ అధినేత వెంకటరమణ, ఉభయదాతలుగా వ్యవహరించారు. వేలాది మంది భక్తులకు హనుమత్జయంతిని పురస్కరించుకుని అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం వందలాది మంది యువకులు, కుడా గార్డెన్స్ నుంచి హనుమకొండ చౌరస్తా వరకు ఉత్సవ హనుమాన్ విగ్రహాన్ని ప్రత్యేక రథంపై ప్రతిష్ఠించి, భజనలతో భక్తిపారవశ్యంతో హనుమాన్ సంకీర్త ణలతో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. వైదిక కార్యక్రమాలు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్ర శర్మ, పెండ్యాల సందీప్‌శర్మ, ఆలయ వేద పండితులు గంగు మణికంఠశర్మ నిర్వహించారు. ఆలయ నిర్వాహణా ధికారి అనిల్‌కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.