మూడు రోజులుగా కురుస్తున్న వాన వదలడం లేదు. ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొడుతోంది. దీంతో చెరువులు మత్తళ్లు దూకుతుండగా, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హనుమకొండ జిల్లాలో 2.9 సెం.మీ, వరంగల్లో 7.3 సెం.మీల వర్షపాతం నమోదైంది. కాజ్వేలు, కల్వర్టులపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వరుస వర్షాలతో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సీజనులో ఇదే పెద్ద వాన కావ డంతో అన్ని పంటలకు ఊపిరిపోసిందని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్, జూలై 20 (నమస్తేతెలంగాణ): జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం దంచికొడుతున్నది. వాగులు, వంకలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. కాజ్వేలు, కల్వర్టుల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని రహదారులు కోతకు గురయ్యాయి. వంతెనలు, కాజ్వేలు, కల్వర్టుల వద్ద అప్రోచ్ రోడ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. వరుసగా మూడో రోజూ ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేదు. దీంతో జన జీవనం స్తంభించింది. గురువారం జిల్లాలో 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెక్కొండ మండలంలో 13.98 సెం.మీ, పర్వతగిరి మండలంలో 12.34 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. వర్ధన్నపేటలో 10.6, రాయపర్తిలో 10.3, ఖానాపురంలో 9, చెన్నారావుపేటలో 6.8, నర్సంపేటలో 6.2, ఖిలావరంగల్లో 5.3, నల్లబెల్లిలో 5.3, వరంగల్లో 5, దుగ్గొండిలో 3.7, గీసుగొండలో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆకేరు, మున్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాజ్వేలు, కల్వర్టుల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో నెక్కొండ, పర్వతగిరి, నర్సంపేట తదితర మండలాల్లోని వివిధ రూట్లలో రాకపోకలకు బ్రేక్ పడింది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద చెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వరంగల్లో ముంపు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. జీడబ్ల్యూఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరంగల్లో కృష్ణకాలనీలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాల, ఎల్బీనగర్లోని ప్రభుత్వ మసూం అలీ ఉన్నత పాఠశాలతోపాటు మరికొన్ని ప్రభుత్వ పాఠశాలల ఆవరణలోకి వరద నీరు ప్రవేశించింది.
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ప్రావీణ్య వ్యవసాయ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, పంచాయతీ, మున్సిపల్, వ్యవసాయ, ఉద్యాన, అగ్నిమాపక శాఖ, ఎన్పీడీసీఎల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండలో రోడ్లు, కల్వర్టులు మరమ్మతులకు గురయ్యే అవకాశం ఉన్నందున రాకపోకలకు అంతరాయం కలుగకుండా ఇరిగేషన్, ఆర్అండ్బీ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెన్నారావుపేట మండలంలోని జల్లి, లింగాపురం గ్రామాల్లో రెండు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిని గోడ కూలినట్లు గుర్తించారని, అధికారులు స్పందించి సహాయక చర్యలను ముమ్మరం చేశారని ఆమె తెలిపారు.
నిండుతున్న చెరువులు
భారీ వర్షాలతో జిల్లాలోని చెరువుల్లోకి వరద నీరు చేరుతున్నది. జిల్లాలో 72 చెరువులు మత్తడి పోస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో పర్వతగిరి మండలానికి చెందినవే 44 ఉండడం విశేషం. నల్లబెల్లి మండలంలో 6, ఖానాపురంలో 5, నర్సంపేటలో 4, దుగ్గొండిలో 4, నెక్కొండలో 3, చెన్నారావుపేటలో 2, వరంగల్లో 2, రాయపర్తిలో 2 చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. జిల్లాలోని 13 మండలాల్లో 815 చెరువులు ఉండగా, 72 చెరువులు పరవళ్లు తొక్కుతున్నాయి. 164 చెరువుల్లోకి 75 నుంచి 100 శాతం నీరు చేరింది. 120 చెరువుల్లోకి 50 నుంచి 75 శాతం, 363 చెరువుల్లోకి 25 నుంచి 50 శాతం, 96 చెరువుల్లోకి 25 శాతంలోపు నీరు చేరినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా పర్వతగిరి మండలంలో 64 చెరువులుంటే 44 మత్తళ్లు పోస్తుండగా, మిగతా 20 చెరువుల్లోకి 75 నుంచి 100 శాతం నీరు రావడం విశేషం. పాకాల, మాదన్నపేట, రంగాయ పెద్ద చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నది. పాకాల సరస్సు నీటిమట్టం 31 అడుగులు కాగా 17కు చేరింది. మాదన్నపేట చెరువు 17 అడుగులకు 11.5 దాటినట్లు అధికారులు చెప్పారు. నల్లబెల్లి మండలంలోని రంగాయ చెరువు నీటిమట్టం 17 అడుగులకు 12.5 అడుగులు దాటినట్లు వెల్లడించారు.