వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 6 : చూసిందంతా నిజమైన బంగారం అనుకుంటే పొరపాటే.. ఇప్పుడు నకిలీ ఆభరణాలు.. ప్రమాణాలకు అనుగుణంగా లేని వాటికి కూడా హాల్మార్క్ ముద్ర వేసే కేటుగాళ్లు తయారయ్యారు. కొందరు వ్యాపారులు హాల్మార్క్ సెంటర్ల నిర్వాహకులతో కుమ్మక్కై నకిలీ బంగారానికి నాణ్యతా ముద్రలు వేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు.
ఇటీవల ఓ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారాన్ని పరిశీలించిన అధికారులు అది నకిలీదిగా గుర్తించడంతో వ్యాపార వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ముద్రల విషయంలో తేడాలను గుర్తించిన ప్రతీ సారి సెంటర్ నిర్వాహకులు బంగారం వ్యాపార రంగంలో పెద్ద మనుషులతో చర్చలు జరిపి విషయం బయటకు రాకుండా చూస్తున్నారు. తిరిగి యథావిధిగా తమ దందాను కొనసాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో దాడులు, షాపుల్లో అద్దాలు ధ్వంసం చేసిన ఘటనలే కాకుండా పోలీస్ కేసుల వరకు వెళ్లినప్పటికీ మేనేజ్ చేస్తున్నారు.
బంగారం నాణ్యతను క్యారెట్లతో కొలుస్తారు. క్యారెట్ శాతాన్ని బట్టి ఆభరణం ధర నిర్ధారిస్తారు. 22 క్యారెట్ గోల్డ్ ఆభరణంలో 91.6 శాతం అసలు బంగారం మిగిలిన శాతం ఆభరణం పటిష్టత కోసం రాగిని కలిపి తయారు చేస్తారు. అసలు బంగారం పరిమాణం తగ్గిన కొద్దీ ఆభ రణంలో నాణ్యత తగ్గడంతో దాని ధర తగ్గుతూ వస్తుంది. ఆభరణానికి వినియోగించిన అసలు బంగారం పరిమాణాన్ని లెక్కకట్టడానికి శాస్త్రసాంకేతికతతో కూడిన లేజర్ టెక్నాలజీని వినియోగించి లెక్కకడతారు.
నాణ్యతా ప్రమాణాలు సరిగా లేనప్పటికీ 22 క్యారెట్ నాణ్య తా ప్రమాణాలు కలిగి ఉన్నట్లు నకిలీ ముద్రలు వేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో బంగారు ఆభరణం నాణ్యతను గుర్తించలేని వ్యాపారులు, వినియోగదారులు నకిలీ ముద్రలను నమ్మి మోసపోతున్నారు. నకిలీ ముద్ర లు వేసే సెంటర్లకే ఎక్కువ గిరాకీ ఉండడాన్ని పరిశీలిస్తే వాటిని ప్రోత్సహిస్తున్నది కొందరు వ్యాపారులేనన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. నగరంలోని ఓ బడా బంగారు చైన్ల వ్యాపారి రెడీమేడ్ బంగారు ఆభరణాలపై డిస్కౌంట్ ఆఫర్ పెట్టి మరీ అమ్మకాలు జరుపుతున్నాడు.
మండలస్థాయి వ్యాపారులతో కలిసి నాణ్యతా లోపంలో సగభాగాన్ని ఒప్పందం కుదుర్చుకున్న వ్యాపారులకు వాటాలు పంచుతూ 85 శాతం అసలు బంగారంతో ఆభరణాలను తయారు చేసి నకిలీ ముద్రలతో సింగ్ ఈజ్ కింగ్ అన్నరీతిలో గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం కొనసాగిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తయారీ ఖర్చులు, తరుగు విషయంలో మాత్రమే డిస్కౌంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బంగారం ధరపై గానీ, భారంపై గానీ డిస్కౌంట్ ఇవ్వడం చట్ట ప్రకారం నేరం.