ఖిలావరంగల్ మార్చి 10: దుగ్గొండి మండలం పొనకల్లు గ్రామాన్ని లంచగొండుల గ్రామంగా నామకరణం చేయాలని ఓ వ్యక్తి కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగాడు. వివరాల్లోకి వెళ్తే.. గత తహసిల్దార్ ఎలాంటి డాక్యుమెంటు లేకుండా ఇచ్చిన పట్టాదారు పాసుబుక్కును రద్దు చేయాలి. డబ్బు కోసం సొంత అన్నదమ్ముల మధ్య భూతగాదాలు సృష్టించి అవినీతికి అండగా నిలబడ్డ వారిని ప్రజలు చెప్పుతో కొట్టాలి. అవినీతికి కొమ్ము కాసేవారు తమ కుటుంబ సభ్యులను అంగడిలో అమ్ముకోవాలంటూ పొనకల్ గ్రామానికి చెందిన గట్ల సురేందర్ ఫ్లెక్సీతో వరంగల్ కలెక్టరేట్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంశపారంపర్యంగా వస్తున్న 5.30 ఎకరాల భూమిని తన సోదరుడు రాజు మాజీ సర్పంచులతో కలిసి పట్టా చేయించుకున్నాడని ఆరోపించాడు. పహానిలో తన పేరు ఉన్నప్పటికీ లెక్కచేయకుండా తప్పుడు పత్రాలు సృష్టించి నా అనుమతి లేకుండా నా భూమిని భూకబ్జాదారులకు విక్రయించాడన్నారు. పహానిలో నా పేరు ఉంది. ఇది ఎవరు కొనకూడదని అన్నందుకు 2018 ఆగస్టులో కబ్జాదారులు హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా నాటి తహసిల్దార్ పట్టా పాస్ బుక్ అక్రమార్కులకు ఇచ్చాడని తెలిపారు. ఇద్దరు మాజీ సర్పంచులు వారి పూట గడుపుకోవటానికి గట్ల రాజుకు అండగా నిలబడి నాచినపెళ్లి గ్రామానికి చెందిన కొమురయ్యకు భూమిని విక్రయించినట్లు తెలిపారు. వంశపారంపర్యంగా వస్తున్న భూమిని కబ్జా చేసి ఇతరులకు విక్రయించిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, అలాగే పాస్ బుక్ ను రద్దు రద్దుచేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.