మహబూబాబాద్/ములుగు, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సోమవారం సాయంత్రం ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ఈదురుగాలులు ఉధృతంగా వీయగా ములుగు జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవగా గోవిందరావుపేట, మంగపేట మండలాల్లో తీవ్ర ప్రభావం చూపింది. మంగపేట మండలంలోని నర్సింహసాగర్, మల్లూరు గ్రామాల శివార్లలో వెయ్యి ఎకరాల్లో కోత దశకు వచ్చిన మేల్, ఫిమేల్ రకం వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. వడగండ్ల ధాటికి గింజలన్నీ నేల పాలయ్యాయి.
మిగతా చోట్ల సాధారణ వరి, మక్కజొన్న చేలు నేలవాలాయి. కల్లాల్లో ఆరబోసుకున్న మిర్చి కూడా తడిసి ముద్దయి రంగు మారిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గాలి దూమారంతో మిర్చిపై వరదాలు కప్పేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ములుగు జిల్లాకేంద్రంలో గంటన్నర పాటు ఈదురుగాలులతో వర్షం పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోవిందరావుపేట, పస్రాలో గాలివాన బీభత్సానికి ఇంటిపై ఉన్న రేకులు ఎగిరిపోయి వస్తు సామగ్రి చెల్లాచెదురైంది. ఇక మహబూబాబాద్ జిల్లాకేంద్రంతో పాటు కేసముద్రం, కురవిలోనూ వడగండ్ల వాన పడింది. గాలివానతో జిల్లాలో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరంగల్ జిల్లా ఖానాపురంలో ఈదురుగాలులకు పాకాల-చిలుకమ్మనగర్ మధ్య అటవీ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా చెట్లు నేలవాలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.