హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 10 : తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి కోసం టీసీఏ ఎన్నో ఏళ్లుగా చేస్తున్న కృషికి గుర్తింపు ఇవ్వాలని, ఈ విషయంపై క్రికెటర్లు ఏకగ్రీవంగా తీర్మానించారని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి అన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి జైపాల్ సమన్వయంతో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) కోశాధికారి డాక్టర్ పెసరు విజయచందర్రెడ్డి అధ్యక్షతన ‘తెలంగాణ క్రికెటర్స్మీట్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గురువారెడ్డి మాట్లాడుతూ హెచ్సీఏ అవినీతిలో కూరుకుపోయిందని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 10 సెంటర్స్ఆఫ్ ఎక్స్లెన్స్క్రికెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. 2021 జూలై బీసీసీఐ ఇచ్చిన కోలాబరేషన్ ఆదేశాలను హెచ్సీఏ పాటించలేదని, బాంబే హైకోర్టు కంటెంమ్ట్ ఆదేశాల ప్రకారం మార్చి 29, 2025న జరిగిన హెచ్సీఏ-టీసీఏ చర్చలకు తుది రూపం ఇవ్వకపోవడం ద్వారా, హెచ్సీఏకి తెలంగాణ క్రికెట్ అభివృద్ధిపై శ్రద్ధలేదని స్పష్టం అవుతోందన్నారు. ప్రస్తుతం టీసీఏ కోరేది కోలాబరేషన్ కాకుండా మెంబర్షిప్ అని, రాష్ట్ర క్రికెట్ అభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు ముందుకువచ్చి టీసీఏకి గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పొన్నాల జగన్, సమీ, ఎండీ జాకీర్ హుస్సేన్, స్టీఫెన్, శరత్యాదవ్, ఎండీమోహిన్, కలువల శివ, భాస్కర్, నవరసాన్, శశాంక్, పలువురు క్రికెట్ అభిమానులు, సీనియర్ క్రికెటర్లు పాల్గొన్నారు.