కేసముద్రం : రైతులకు ధాన్యానికి సంబంధించిన బోనస్‌ను వెంటనే చెల్లించాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి గుడిశాల వెంకన్న డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ వివేక్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వాతావరణంలో మార్పులు వస్తున్నందున కొనుగోలు కేంద్రాలలో త్వరితన కొనుగోళ్లు చేపట్టాలన్నారు.
గన్ని సంచులు అందుబాటులో ఉంచాలని, ధాన్యం బస్తాలను త్వరితగతిన మిల్లులకు, గోదాములకు తరలించాలని కోరారు. వానాకాలం పెట్టుబడి కోసం రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పెట్టుబడి సహాయాన్ని త్వరగా అందించాలని, రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బాల యాకూబ్ రెడ్డి, చాగంటి కిషన్, వెంకటేశ్వర్లు, జయరాజు, జలంధర్, సోమారపు ఎల్లయ్య, సారయ్య, కేసీఆర్ నాయక్ తదితరులున్నారు.