స్థానిక సంస్థల ఎన్నికలపై అస్పష్టత నెలకొంది. కీలకమైన బీసీ కోటాపై రోజురోజుకు మారుతున్న పరిణామాల నేపథ్యంలో అసలు ఎన్నికలుంటాయా? ఉంటే ఎప్పుడు జరుగుతాయనే అయోమయం పెరుగుతోంది. అసెంబ్లీలో తీర్మానం చేశాం.. కేంద్రమే తేల్చాలని కాంగ్రెస్.. బీసీ కోటాపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు అన్నీ తెలిసే కేంద్రంపై నెపం నెడతున్నదని బీజేపీ.. ఇలా రెండు పార్టీలు చేసుకుంటున్న పరస్పర విమర్శలు, నాన్చివేత ధోరణి ఎన్నికల నిర్వహణపై అనుమానాలను మరింత పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే కోటాపై స్పష్టమైన వైఖరి తేల్చకుండా రెండు పార్టీలు మోసం చేస్తున్నాయని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. కాగా స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసి ఏడాది గడిచినప్పటికీ ఓటమి భయం వల్లే కాంగ్రెస్ సర్కారు ఎన్నికలు నిర్వహించడం లేదనే చర్చ ప్రస్తుతం పల్లెల్లో జోరుగా నడుస్తున్నది.
హనుమకొండ, జూలై 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి); పదవీ కాలం ముగియడంతో జిల్లా ప్రజా పరిషత్, మండ ల ప్రజాపరిషత్, గ్రామ పంచాయతీల ఎన్నికలను సెప్టెంబర్ లోపు నిర్వహించాలని హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పోలింగ్ బూత్‌ల ఎంపిక, నిర్వహణ సిబ్బం ది, బ్యాలెట్ పేపర్లు, బాక్సులను సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది.
ఎన్నికల్లో బీసీ కోటాపై ప్రభు త్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లోని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నది. అంతేగాక త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసినట్లుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నది. అయితే కీలకమైన బీసీ కోటాపై మాత్రం రోజురోజుకు అయోమయాన్ని పెంచుతున్నది.
ఈ క్రమంలో ఎన్నికలు ఎప్పుడు ఉంటాయనే సందేహాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడా చూసినా ఇదే చర్చ జరుగుతున్నది. గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగిసి ఏడాదిన్నర, జడ్పీ, మండల ప్రజా పరిషత్‌ల పదవీకాలం ముగిసి ఏడాది అవుతున్నా ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించడం లేదనే చర్చ గ్రామాల్లో జరుగుతున్నది. కుల గణన అని చెప్పి కొన్ని రోజులు వాయిదా వేసింది. ఇది శాస్త్రీయంగా జరగలేదని బీసీ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆ తర్వాత బీసీ కోటా పెంపు అని చెబుతూ వచ్చింది. రిజర్వేషన్లలో 42 శాతం కోటా విషయంలో అమలు చేసే విధంగా కాకుండా వాయిదా వేసే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారశైలి ఉన్నదని బీసీ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
అంతా ఢిల్లీ చుట్టూ..
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే లోపాలమయంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎత్తిచూపింది. ఉద్దేశపూర్వకంగానే బీసీల జనాభాను తగ్గించి చూపించిందంటూ గణాంకాల్లోని తప్పులను ఎత్తిచూపింది. బీసీలకు 42శాతం కోటాపై కాంగ్రెస్, బీజేపీలు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే సందర్భాలను వివరిస్తున్నది. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను ఎగ్గొట్టేందుకు రెండు జాతీయ పార్టీలు ఒక్కటయ్యాయని చెబుతున్నది. వాస్తవ పరిస్థితులు అ లాగే ఉంటున్నాయి.
బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం విమర్శించుకుంటూ బీసీ కోటా అమలును వాయిదా వేసే లా కుట్రలు చేస్తున్నాయని ఈ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రంలో అధికారంలో ఉ న్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నా న్చివేత ధోరణి అవలంబిస్తున్నాయి. అసెంబ్లీలో తీ ర్మానం చేశామని, కేంద్ర ప్రభుత్వమే తేల్చాలని కాం గ్రెస్ పార్టీ చెబుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం కోటాపై అసెంబ్లీలో మద్దతు తెలిపిన బీజేపీ కేంద్రంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అం టున్నది.
బీసీ కోటాపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అన్నీ తెలిసి కేంద్ర ప్రభుత్వంపై నెపం వేస్తున్నదని బీజేపీ అంటున్నది. ఢిల్లీలో పోరాటం అని చెబు తూ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తున్నదని, ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేయకుండా బీజేపీ ఇదే దారిలో నడుస్తున్నదని బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీలకు 42శాతం కోటాతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించాలని, లేకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నాయి. బీసీ కోటాపై కాంగ్రె స్, బీజేపీల తాజా వ్యవహార శైలితో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అస్పష్టత పెరుగుతున్నది.