నమస్తే నెట్వర్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెండో రోజైన సోమవారం పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య 50 శాతం మించలేదు. హనుమకొండ జిల్లాలో 82 కేంద్రాల్లో 33,006 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా ఉదయం 16,025, మధ్యాహ్నం 16,044 మంది హాజరయ్యారు. వరంగల్ జిల్లాలో 28 కేంద్రాల్లో 11,310 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, ఉదయం, మధ్యాహ్నం 5,167 మంది హాజరయ్యారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 17 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా, ఉదయం 4,423 అభ్యర్థులకు 2,099, మధ్యాహ్నం 2,097 మంది హాజరయ్యారు. జనగామ జిల్లాలో 16 కేంద్రాల్లో 5,470 మంది అభ్యర్థులకు పరీక్ష జరుగగా ఉదయం 2.893, మధ్యాహ్నం 2,891 మంది హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లాలోని 21 కేంద్రాల్లో 7,470 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా, ఉదయం 3,806, మధ్యాహ్నం 3,803 మంది హాజరయ్యారు.
ములుగు జిల్లాలోని 9 కేంద్రాల్లో 2,195 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, ఉదయం 1,102, మధ్యాహ్నం 1,099 మంది హాజరయ్యారు. కాగా, పలు పరీక్షా కేంద్రాలను జయశంకర్ భూపాలపల్లి, ములుగు కలెక్టర్లు రాహుల్ శర్మ, టీఎస్ దివాకర తనిఖీ చేయగా, మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సెంటర్ వద్ద సరళిని పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఘటనలు జరుగుకుండా పోలీసులు 144 సెక్షన్ విధించి బందోబస్తు నిర్వహించారు.
గణపురం, డిసెంబర్ 16: గ్రూప్-2 పరీక్షకు మహిళా అభ్యర్థి రెండు నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు సెంటర్లోకి అనుమతించలేదు. వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్-2 పరీక్ష కేంద్రానికి రెండోరోజు సోమవారం భూపాలపల్లి పట్టణానికి చెందిన ఓ యువతి రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో అధికారులు ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించలేదు. ‘తాను అనారోగ్యంతో ఉన్నానని, దవాఖానకు వెళ్లి వచ్చానని, పరీక్ష రాసేందుకు అనుమతించాలని అధికారులను ప్రాధేయపడినా కనికరం చూపలేదు. దీంతో ఆ యువతి చేసేదేమీ లేక విలపిస్తూ వెనుదిరిగి వెళ్లిపోయింది.