చెన్నారావుపేట, మార్చి 20 : సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన గృహలక్ష్మి పథకాన్ని నియోజకవర్గంలో ఉప్పరపల్లి గ్రామం నుంచే ప్రారంభిస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. తాను ఉద్యమకారుడినని, పైసలు సంపాదించుకొనే కాంట్రాక్టర్ కాదన్నారు. సోమవారం ఉప్పరపల్లిలో కాంగ్రెస్ సర్పంచ్ శ్రీధర్‌రెడ్డితో పాటు దాదాపు 200 మంది హస్తం పార్టీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి పెద్ది గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎంతో మంది గులాబీ పార్టీలో చేరుతున్నారని చెప్పారు.
ఉప్పరపల్లి ప్రజలు కల్మషం లేనివారని, గ్రామాభివృద్ధికి నిత్యం కృషి చేస్తానని తెలిపారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద మొదటి విడుతలోనే గ్రామంలోని పాఠశాలను ఎంపిక చేసి రూ.1.05 కోట్లతో మౌలిక వసతులు కల్పించామని గుర్తు చేశారు. అలాగే 1.20 కోట్లతో అంతర్గత రోడ్ల పనులు ప్రారంభించామన్నారు. నిర్మాణాలకు ఇటీవలే శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలు ఆశీర్వదించి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తి నాయక్, ఎంపీపీ విజేందర్, వైస్ ఎంపీపీ, మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, సర్పంచ్ కుండె మల్లయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, చెన్నారావుపేట పీఏసీఎస్ వైస్ చైర్మన్ చింతకింది వంశీ, రైతు బంధు సమితి మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, ఎంపీటీసీలు మహేందర్, విజేందర్, మాజీ ఎంపీపీ జక్క అశోక్, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, మండల నాయకుడు కృష్ణచైతన్య, మండల కో ఆప్షన్ సభ్యుడు గఫార్, తూటి శ్రీనివాస్, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
నాడు ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో చెప్పాలి..
ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు ఇక్కడి ప్రతిపక్ష నాయకులకు లేదని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. కోనాపురం గ్రామంలో రూ.50 లక్షలతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో డీబీఎం-40 కాల్వను తవ్వి ఎన్ని ఏళ్లు అయిందో.. ఎన్ని ఎకరాల పంటలకు నీళ్లు ఇచ్చారో గత పాలకులు సమాధానం చెప్పాలన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ నాలుగేళ్లలో ఎన్ని ఎకరాల పంటలకు నీళ్లిచ్చానో ప్రజలే చెబుతారన్నారు. వడగండ్ల బాధిత రైతులకు నష్టపరిహారం చెక్కులు అందించాకే ఓట్లు అడుగుతానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాతాసారంగం, గ్రామ అధ్యక్షుడు దొంగల రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
రైతులను ఆదుకుంటాం..
దుగ్గొండి : వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే పెద్ది సదర్శన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మండలంలోని అడవిరంగాపురం, చాపలబండ, మధిర, మందపల్లి, రాజ్యాతండాలోని పంటలను పరిశీలించారు. వర్షాలకు కూలిన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ఇల్లు కూలిపోయిన వారి పేర్లను ఉన్నతాధికారులకు నివేదించాలని తహసీల్దార్ సంపత్‌కుమార్‌కు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట చేతికందే సమయంలో అకాల వర్షంతో దెబ్బతినడం బాధాకరమన్నారు. మండల వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలపై సర్వే చేసి నివేదికను రూపొందించాలని అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, వైస్ ఎంపీపీ పల్లాటి జేపాల్‌రెడ్డి, ఏవో దయాకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, కంచకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, బుస్సాని రమేశ్, సింగతి రాజన్న, సర్పంచ్‌లు కొండం రమాదేవీవిజేందర్, రవీందర్‌నాయక్, ఎంపీటీసీ పిండి కుమారస్వామి, ఏఈవో మధు, రాజేశ్ పాల్గొన్నారు.