భూపాలపల్లి, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రభుత్వం భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి రూ.59.91కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వెల్లడించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతుకు రూ.5.47కోట్లు, బీటీ రెన్యూవల్‌కు రూ.15.60కోట్లు, ఎంఆర్ఆర్ పనులకు, బీటీ రెన్యూవల్(పాతవాటికి) రూ.4.75 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి ఈజీఎస్ నిధులు రూ.2కోట్లు, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కింద రూ.5.83కోట్లు, కేంద్రంలోని ప్రభుత్వ వంద పడకల దవాఖానకు వచ్చే పేషెంట్స్, వారి సహాయకులు భోజనం చేసేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు షెడ్డు నిర్మాణానికి రూ.37లక్షలు, టీఎస్ఎంఎస్ఐడీసీ నిధులు రూ.3.60కోట్లు, ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులు, బీటీ రెన్యూవల్‌కు రూ.11.75కోట్లు, బస్తీబాట కార్యక్రమంలో భాగంగా రూ.కోటీ 26 లక్షలు, 45 గ్రామపంచాయతీల నూతన భవన నిర్మాణాలకు రూ.20లక్షల చొప్పున రూ.9కోట్ల నిధులు మంజూరైనట్లు వివరించారు.
2021లో వడగండ్ల వాన కురిసి దెబ్బతిన్న మిర్చి పంటకు పరిహారం ఇవ్వాలని నాడు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, తాను కలిసి విన్నవించగా స్పందించిన సీఎం కేసీఆర్ హెలిక్యాప్టర్ ద్వారా సర్వే చేయించారని గుర్తుచేశారు. ఫలితంగానే పరిహారం కోసం మొత్తం రూ.13.86కోట్లు మంజూరు కాగా, జిల్లాకు రూ.కోటి 36లక్షలు మంజూరు చేసిందని, ఈ పరిహారం డబ్బులు కొద్ది రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా పడతాయని, దీనికి కొనసాగింపుగా ఈ రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయడానికి ఈ నెల 26న లీడ్ బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జెన్కో నిర్వాసిత గ్రామం దుబ్బపల్లి ఒక చోటకు, సింగరేణి నిర్వాసిత గ్రామాలు గడ్డిగానిపల్లి, పక్కీర్గడ్డ, కొండంపల్లి మరోచోటకు తరలిస్తామని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణపై కక్షపూరితంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్యే దుయ్యబట్టారు.
కోచ్ యూనివర్సిటీకి సరిపోయే నిధులు ఇవ్వం అంటే ఇక ఏం చేస్తోరో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని కోటగుళ్లు, పాండవులగుట్ట, ప్రతాపరుద్రకోట, కాళేశ్వర దేవాలయం, నాపాక దేవాలయం ఇలా ఎన్నో చారిత్రాత్మక కాకతీయ కట్టడాలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి నిధులు మంజూరు చేయాలని నలుగురు బీఆర్ఎస్ ఎంపీలతోపాటు తాను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి కోరినప్పటికీ నిధులు విడుదల చేయలేదన్నారు. చంద్రబాబునాయుడు, షర్మిళకు తెలంగాణలో తిరిగే నైతిక హక్కు లేదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ అర్భన్ కమిటీ అధ్యక్షుడు కటకం జనార్ధన్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌కుమార్, హనుమా ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం కుమార్‌రెడ్డి, బీఆర్ఎస్ గణపురం మండల అధ్యక్షుడు లక్ష్మినరసింహారావు, కౌన్సిలర్లు శిరుప అనిల్‌కుమార్, నూనె రాజు, బద్ది సమ్మయ్య, స్వామి బీఆర్ఎస్ నేతలు సెగ్గం సిద్ధు, పిల్లలమర్రి నారాయణ, బీబీ చారి, మాడ హరీశ్‌రెడ్డి, శ్రీనివాస్, మేనం తిరుపతి, అశోక్, కృష్ణమూర్తి, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.