హనుమకొండ, ఏప్రిల్ 6 : ఉమ్మ డి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో ములుగు మినహా మిగతా ఐదు జిల్లాల్లో సుమారు 715 మం దిపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కార్యదర్శుల నుంచి ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ఆప్షన్లు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. హనుమకొండ జిల్లాలో సుమారు 127 మంది, భూపాలపల్లిలో 120, వరంగల్లో 180, మ హబూబాబాద్లో 190, జనగామ లో వంద మంది బదిలీ కానున్నట్లు తెలిసింది. గత జూలైలోనే బదిలీలు జరిగాయని, మళ్లీ ఇప్పుడు చేయడం పై పలువురు కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఉమ్మడి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు తమ మాటను కార్యదర్శులు వినడం లేదని జిల్లా ఇన్చార్జికి మొరపెట్టుకోగా, ఆయన ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు అధికారులు ఈ బదిలీలు చేపడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. నాలుగు నెలలుగా బదిలీల విషయంలో ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రి, అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతున్నది. ఒకే గ్రామంలో రెండేళ్లకు పైబడి విధులు నిర్వర్తిస్తున్న కార్యదర్శుల జాబితాను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా వరంగల్ ఉమ్మడి జిల్లా లో బదిలీలు జరగనుండడంతో పలువురు కార్యదర్శులు అసహనం వ్యక్తం చేస్తున్నా రు.
బలవంతపు బదిలీల నేపథ్యంలో కార్యదర్శులు ఆందోళన చెం దుతున్నారు. అయితే గత ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసినప్పటి నుంచి తమ సొంత డబ్బులతో పాటు అ ప్పులు తెచ్చి అత్యవసర, అభివృద్ధి పనులకు ఖర్చు చేశామ ని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నరగా లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, వాటి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాగా, పంచాయతీ కార్యదర్శుల బదిలీల విషయమై డీపీవో లక్ష్మీరమాకాంత్ను ఫోన్లో సంప్రదించగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి నుంచి ఆప్షన్లు తీసుకున్నమాట వాస్తవమేనని తెలిపారు.
బదిలీలకు మేము వ్యతిరేకం కాదు. గత ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసినప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో పలు అత్యవసర, అభివృద్ధి పనులకు సంబంధించి కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చు చేశారు. ఏడాదిన్నరగా బిల్లులన్నీ పెండింగ్లో ఉన్నాయి.
పైగా గత జూలై నెలలోనే బదిలీలు జరిగాయి. ఆకస్మికంగా మళ్లీ బదిలీలంటూ ఆప్షన్లు తీసుకోవడంపై పలువురు కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక నియోజక వర్గం నుంచి మరో నియోజక వర్గానికి బదిలీలంటున్నారు. ఇప్పటికే కొందరు తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. నియోజక వర్గం కాకుండా ఒక మండలం నుంచి మరో మండలానికి, అది కూడా పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే బదిలీలు చేపట్టాలని కోరుతున్నాం.
-జనగాని అశోక్, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు, హనుమకొండ జిల్లా