ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పాలన అస్త్యవస్తంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిధుల్లేక గ్రామాల అభివృద్ధి అటకెక్కింది. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడి పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరిగింది. కనీసం వీధి దీపాలు, బోర్ల మరమ్మతు, జీపీ ట్రాక్టర్లకు డీజిల్ కూడా కొనలేని పరిస్థితి ఉంది. ఇప్పటి దాకా సొంతంగా తమ జేబుల్లో నుంచి వేలాది రూపాయలు ఖర్చు చేసిన కార్యదర్శులు ట్రాక్టర్ల నిర్వహణ తమ వల్ల కాదని ఎంపీడీవోలకు వినతిపత్రాలు ఇస్తూ వాటికి తాళాలు వేసి అప్పగించారు. పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. సరైన నిర్వహణ లేక పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలు సైతం చెల్లించలేని దుస్థితి నెల కొంది.
– జయశంకర్ భూపాలపల్లి.
జూన్ 12 (నమస్తే తెలంగాణ) : గతేడాది జనవరి 31 తో సర్పంచ్ల పదవీకాలం పూర్తి కాగా కాంగ్రెస్ ప్రభుత్వం క్లస్టర్ గ్రామాలు ఎంపిక చేసి ప్రత్యేక అధికారులను నియమించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 248 గ్రామ పంచాయతీల్లో వారికి బాధ్యతలను అప్పగించిన ప్రభుత్వం నిధులు, విధులపై స్పష్టత లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉండడంతో వీధి దీపాలు, బోర్ల మరమ్మతులు, పంచాయతీ ట్రాకర్లకు డీజిల్ కొనేందుకు కూడా చిల్లిగవ్వ లేదు. ఉద్యోగులకు సైతం వేతనాలు చెల్లించలేని స్థితిలో పంచాయతీలు ఉన్నాయి.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో పల్లెల్లో పడకేసిన పారిశుధ్యంతో వ్యాధుల ముప్పు పొంచి ఉందని వైద్యులు సూచిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. దీంతో గ్రామాల్లో, పట్టణాల్లో ఎలాంటి సమస్యలు లేకపోవడంతో వ్యాధుల జాడ కనిపించలేదు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలతో కొత్త శోభ సంతరించుకుంది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. సర్పంచ్ పదవీకాలం పూర్తయిన 16 నెలల నుంచి అభివృద్ధికి ఎలాంటి నిధులు లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. నిధుల మంజూరు లేకపోవడంతో ప్రత్యేక అధికారులు సైతం చేసేదేమీ లేక కార్యదర్శిలపై భారం మోపారు. పల్లెల్లో పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు ఎండిపోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. శ్మశాన వాటికలను పట్టించుకునేవారే లేరు.
హరితహారం, ఉపాధి హామీ, పల్లె ప్రగతి, పన్నుల వసూలు, జనన మరణాల నమోదు , కల్యాణ లక్ష్మి.. ఇలా అనేక పనులతో పంచాయతీ కార్యదర్శిలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెద్ద గ్రామ పంచాయతీల్లో తాగునీరు, ఇంటి పన్నుల వసూలు డబ్బులతో అత్యవసర పనులు చేసుకుంటుండగా , తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. గతంలో చెత్త సేకరణకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లు , ఆటోలకు పంచాయతీ నుంచి కిస్తులు చెల్లించడంతో ఖాతాలు ఖాళీ అయ్యాయి.
గ్రామాల్లో కాల్వలు శుభ్రం చేయడం, తాగునీటి పైపులైన్ లీకేజీలు సరిచేయడం, ట్రాక్టర్లలో డీజిల్ పోయించడం తదితర అత్యవసర పనుల కోసం కార్యదర్శులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీలకు 15 వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ నిధులు రాకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు మంజూరు లేదని, ఉద్యోగులకు వేతనాలు సైతం నేరుగా వారి అకౌంట్లలోకే వెళ్తున్నాయని, తాము ఏమీ చేయలేమని జిల్లా పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు.