శాయంపేట, అక్టోబర్ 8 : యాసంగిలో ఐకేపీ ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై మూడో రోజైన బుధవారం విజిలెన్స్ అధికారుల విచారణ జరిగింది. హనుమకొండ సివిల్ సప్లయ్ కార్యాలయంలో ఆ శాఖ హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్ నేతృత్వంలో విచారణ కొనసాగుతున్నది. రెండు రోజుల పాటు శాయంపేట మండలంలోని కాట్రపల్లి, శాయంపేట ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, వ్యవసాయ అధికారులను విచారించారు. యాసంగి కొనుగోళ్లలో భారీ స్కాం జరిగినట్లు తేలడంతో లోతుగా విచారణ చేసి పూర్తి ఎవిడెన్స్ సంపాదించినట్లు తెలిసింది.
యాసంగిలో శాయంపేట, కాట్రపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు నిర్వాహకులు అక్రమాలకు పాల్పడినట్లు సివిల్ సప్లయ్ కమిషనర్‌కు ఫిర్యాదు వెళ్లిన క్రమంలో విజిలెన్స్ అధికారులు విచారణ మొదలుపెట్టారు. హనుమకొండ జిల్లాలోని కమలాపూర్‌లోని ఓ రైస్‌మిల్లు కేంద్రంగా ధాన్యం కొనుగోళ్ల అక్రమాలు జరిగినట్లు, శాయంపేటకు చెందిన ఒకరు ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్లు గుర్తించారు. ధాన్యం లేకుండానే నకిలీ రైతులను సృష్టించి కోటి రూపాయలు కాజేసినట్లు తేలింది. నకిలీ ట్రక్షీట్లను తయారుచేసి మిల్లు యజమానితో పాటు ఐకేపీ నిర్వాహకులు అక్రమాలకు తెరలేపినట్లు, ఇందులో శాయంపేట, కాట్రపల్లి అగ్రికల్చర్ అధికారులు భాగస్వాములైనట్లు తేల్చారు.
అయితే హనుమకొండలోని జిల్లా సివిల్ సప్లయ్ అధికారులతో పాటు శాయంపేట, కాట్రపల్లి ఐకేపీ ఇన్చార్జి సీసీలు, ఏపీఎంను కూడా విజిలెన్స్ అధికారులు విచారించారు. ఇప్పటికే ఐకేపీ కొనుగోలు నిర్వాహకులు, సీసీ, ఏఈవోలను విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు రహస్యంగా విచారించి రికార్డులు సీజ్ చేశారు. ఏఈవోలు ఇచ్చిన టోకెన్ల వివరాలు సేకరించారు. అయితే నకిలీ రైతుల పేరుతో ట్రక్షీట్లను తయారు చేసి మిల్లర్‌తో కుమ్మక్కై రూ.కోటి వరకు అకౌంట్లకు మళ్లించినట్లు గుర్తించారు. కమలాపూలోని రైస్‌మిల్లు యజమాని, శాయంపేట, కాట్రపల్లిలోని ఇద్దరు ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించి వివరాలు సేకరించారు.
మిల్లర్‌కు సంబంధించిన ఒకరికి పెద్ద మొత్తంలో డబ్బులు జమైనట్లు అధికారులు గుర్తించారు. సీఎంఆర్ ఉన్నప్పటికీ మిల్లులో ధాన్యం లేకపోవడంతో తీగ లాగితే డొంక కదిలి అక్రమాలు బయటపడినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు ఎప్పుడూ జరగలేదని చెబుతున్నారు. విజిలెన్స్ అధికారులు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. అయితే కాట్రపల్లి, శాయంపేటలోనే కాకుండా మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి అక్రమాలు చోటుచేసుకున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది.