హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 3: బీఆర్ఎస్ పాలనలో అన్నివర్గాల వారికి సమప్రాధాన్యం కల్పిస్తుండడంతో తెలంగాణ రాష్ట్రం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టుశిక్షణ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. రాయపురలోని ఓ ఫంక్షన్ హాల్లో ముస్లిం మహిళలకు కుట్టుమిషన్లు అందజేశారు. ఆయాచోట్ల చీఫ్ విప్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. ఇతర పార్టీ మైనార్టీలను ఓట్ల కోసమే వాడుకున్నాయన్నారు. దేశాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్ చేసిందేమిటో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముస్లింలను రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని చెప్పారు. ఒక్కో విద్యార్థిపై రూ.1,20,000 వెచ్చించి నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్యను అందిస్తున్నదని గుర్తుచేశారు.
ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో తాను పనిచేయడం వరంగా భావిస్తున్నానన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ తెచ్చి వైద్య రంగాన్ని సైతం బలోపేతం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దకుతుందన్నారు. మత విద్వేషాలు, మత కల్లోలాలు సృష్టిస్తూ ఓట్లు అడిగేందుకు వస్తున్న పార్టీల నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘అందుబాటులో ఉండి సేవచేసే నాయకుడిని ఎన్నుకోవాలి.. ఏ సమయంలో వచ్చి నా తలుపుతట్టినా మీకు నా వంతు సహకారం అందించిన.. మీ కుటుంబంలో ఒకడిగా నన్ను ఆదరించండి’ అని విజ్ఞప్తి చేశారు.
మున్ముందు టెక్స్టైల్ పారులో ఉపాధి అవకాశాలు ఇప్పిస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని దర్గాలో ఇప్పటికే గుసుల్ ఖానా నిర్మించామని, ములుగు రోడ్ సమీపంలో రూ.30లక్షలతో మరో గుసుల్ ఖానా నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమాల్లో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, స్టేట్ ఖాదీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా యూసుఫ్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్‌ఖాన్, మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
పండుగలా కుట్టుమిషన్ల పంపిణీ
పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు రాయపురలోని ఓ ఫంక్షన్హాల్లో కుట్టు మిషన్లను చీఫ్‌విప్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పండుగలా కొనసాగింది. ఇక్కడ వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ మైనారిటీల కోసం షాదీ ముబరాక్, కుట్టుమిషన్ల పంపిణీ, రుణాలు, రెసిడెన్షియల్ సూళ్లు, ఓవర్సీస్ పథకం, రంజాన్ కానుకలు, ఇమామ్‌లకు రూ.5000 చొప్పున భృతి ఇలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది దేశంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసీఆర్ తోఫా పథకం ద్వారా నియోజవర్గంలోని 300 మంది లబ్ధిదారులకు కుట్టుమిషన్లు అందించామని చెప్పారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు 50 మందికి ఓవర్సీస్ సాలర్షిప్ అందించామని చెప్పారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మరో 50 మందికి కుట్టు మిషన్లు అందిస్తామని వివరించారు.