వరంగల్/హనుమకొండ చౌరస్తా/ఖిలా వరంగల్, ఆగస్టు 28 : వరంగల్ చారిత్రక, వారసత్వ నగరమని, కాకతీయ రాజుల సామ్రాజ్య నగరంగా ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న నగరంగా ప్రసిద్ధి చెందినదని ఈ ప్రాంత పర్యటన మరిచిపోలేదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆయన వరంగల్ నగరంలో కలియదిరిగారు. ఉదయం ఎన్ఐటీ గెస్ట్‌హౌస్‌కు రోడ్డు మార్గం ద్వారా చేరుకున్నారు.
ఆయనకు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్య, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కె.ఆర్.నాగరాజు, కడియం శ్రీహరి, కలెక్టర్ ప్రావీణ్య పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి నేరుగా హనుమకొండ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జాతీయ గీతాలాపన అనంతరం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ చారిత్రక కట్టడాలు, ఆలయాలకు వరంగల్ నిలయమన్నారు. చారిత్రక, వారసత్వ వరంగల్ నగరం మరింత సుస్థిరాభివృద్ది సాధించాలని ఆయన ఆకాంక్షించారు. వ్యవసాయ రంగంలో ముందుండాలన్నారు. పీఎం కుసుమ్ యోజన ద్వారా సౌర విద్యుత్‌ను వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. సౌర విద్యుత్‌పై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశలో అడుగులు వేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాలు అభివృద్ధి చెందేందుకు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ఉండటం సంతోషకరమన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలు ముందంజలో ఉండడం సంతోషకరమన్నారు. స్వయం సహాయక సంఘాలతో మహిళలు మరింత ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. నగరంలో దవాఖానలు పరిశుభ్రంగా ఉండడం సంతోషం కలిగించిందన్నారు.
వరంగల్, హనుమకొండ, గ్రేటర్లో అభివృద్ధి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గవర్నర్‌కు వివరించారు. చారిత్రక ఆలయాలు, ప్రదేశాలు, స్మార్ట్‌సిటీ, పార్కు లు, జాతీయ రహదారులు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, విపత్తుల నిర్వహణ కోసం వినియోగిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రతిపాదనలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, కాళోజీ కళాక్షేత్రం, గ్రేటర్ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ఎంజీఎం, ఐసీడీఎస్, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌పై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. నేర నియంత్రణ చర్యలపై సీపీ అంబర్ కిశోర్ ఝా వివరించారు.
నగరంలోని రెడ్‌క్రాస్ భవనాన్ని గవర్నర్ సందర్శించి ఎన్సీసీ కేడెట్ల వందనం స్వీకరించారు. అనంతరం తలసేమియా వార్డులో చిన్నారులతో ముచ్చటించి పండ్లు అందజేశారు. రెడ్‌క్రాస్ నూతన భవనాన్ని ప్రారంభించారు.
కలెక్టరేట్లో కవులు, రచయితలు, క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాల్లో అవార్డులు పొందిన వారితో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చర్చాగోష్టి నిర్వహించారు. లంకా శివరాం ప్రసాద్ (రచయిత), మహ్మద్ అన్వర్ మియా ( ఐఎంఏ ప్రెసిడెంట్), మండల పరుశరాములు(సామాజిక కార్యకర్త), గుల్షన్ (ఉర్దూ రచయిత), నాగరాజు (జాతీయ బ్లైండ్ పారాజోడో అవార్డు గ్రహీత), పిట్టల రాములు(చేనేత జాతీయ అవార్డు గ్రహీ త), అంపశయ్య నవీన్(సాహిత్య అవార్డు గ్రహిత),పోట్లపల్లి శ్రీనివాసులు(రచయిత), గజ్జల రంజిత్(పేరిణి నృత్యకారులు), పాండురంగారావు(ఇంటాక్ కో కన్వీనర్),
నెల్లుట్ల రమాదేవి(రచయిత), అజిత్‌ఖాన్(అల్ ఇండియా గోల్డ్ మెడలిస్ట్), సారంగపాణి(క్రీడాకారుడు), లక్ష్మీకాంతారావు(సహృదయ నాటక సంఘం), ప్రవీణ్(తానా అధ్యక్షులు), డాక్టర్ విజయచందర్‌రెడ్డి(రెడ్ క్రాస్ అధ్యక్షులు) మరో 40మంది ప్రముఖులతో ముచ్చటించి వారితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఆయచోట్ల మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు బస్వరాజ్ సారయ్య, తీన్మార్ మల్లన్న, మేయర్ సుధారాణి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం,
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినితానాజీ వాకాడే, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, దేవాదాయశాఖ ఉప కమిషనర్ శ్రీకాంతారావు, డీఎఫ్‌వో అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.సునీత, ఈవో కె.వెంకటయ్య, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, డీజీటీడీసీ డీజీఎం ఇబ్రహీం, ఎస్ఎల్ ఏఈఈ రాంప్రసాద్, ఎస్ అండ్ ఎల్ ఇన్చార్జీ జీ అజయ్, ఏఐఎస్ సీఏ మడిపల్లి మల్లేశం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, పీఏసీఎస్ చైర్మెన్ కేడల జనార్దన్, మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడు సంగరబోయిన చందర్, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్‌లో వారసత్వ కట్టడాలు అత్యద్భుతంగా ఉన్నాయని గవర్నర్ అన్నారు. పర్యటనలో భాగంగా వేయిస్తంభాల ఆలయ సందర్శనకు వచ్చిన ఆయనకు ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రొఫెసర్ పాండురంగారావు, జిల్లా పురావస్తుశాఖ అధికారి ఎం.మల్లేశం ఆలయ చరిత్ర, కట్టడం విశిష్టతను వివరించారు. అలాగే భద్రకాళీ ఆలయంలో ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం చారిత్రక ఖిలావరంగల్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ సంప్రదాయ నృత్యాలు, కోలాటాలు, బతుకమ్మలు, బోనాలు, డప్పులతో గవర్నర్‌కు ఖుష్‌మహల్ వద్ద ఘన స్వాగతం పలికారు. కీర్తితోరణాల ప్రాంగణం వరకు స్వాగతం పలికారు. కాకతీయుల పేరిణి, రాణీరుద్రమదేవి నృత్యరూపకం, చిందు యక్షగానం నృత్యాలను ఆసక్తిగా వీక్షించారు. అనంతరం స్వయంభూ శ్రీ శంభులింగేశ్వరస్వామి దేవస్థానానికి చేరుకోగా అర్చకులు శీలమంతుల శంభులింగం పూర్ణకుంభ స్వాగతం పలికారు.
అనంతరం కీర్తితోరణాల విశిష్టతతో పాటు కాకతీయలు కళాఖండాలను టూరిజం అసిస్టెంట్ ప్రమోషన్ ఆఫీసర్ సూర్యకిరణ్ గవర్నర్‌కు వివరించారు. కాకతీయ రాజుల కాలం నాటి కట్టడాలు, శిల్ప సంపదను ఆసక్తిగా తిలకించారు. వరంగల్‌లో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయని, శిల్ప సంపద అపూర్వమని కొనియాడారు. వందల ఏళ్ల నాటి వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు. వరంగల్ పర్యటన సంతోషాన్ని కలిగించిందని అన్నారు. రామప్ప, వేయిస్తంభాల అలయాలతో పాటు ఎన్నో అద్భుత కట్టడాలను చూడడం మరచిపోలేని అనుభూతి అని చెప్పారు.