నర్సంపేట, ఫిబ్రవరి 8: ఆడబిడ్డల పెళ్లిళ్లకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పెద్ది 141 మంది లబ్ధిదారులకు రూ. 1.14 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాలన్ని విజయవంతంగా అమలు చేస్తున్నదని కొనియాడారు. తనను బంధువులా భావించి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆహ్వానిస్తే వీలునుబట్టి వస్తానన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కల్యాణలక్ష్మి పథకంలో పది లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు సీఎం కేసీఆర్ చేయూతనిచ్చినట్లు గుర్తుచేశారు. పార్టీలకతీతంగా పైరవీలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు కల్యాణలక్ష్మి పథకం అందుతున్నదన్నారు. గతంలో పేదింట్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయాలంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడే వారన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో నిరుపేదలకు ఆర్థిక భరోసా కలుగుతున్నదన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో పవన్‌కుమార్, తాసిల్దార్ రామ్మూర్తి, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు, ఎంపీడీవోలు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
దుగ్గొండి మండలకేంద్రంలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ కబడ్డీ కప్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శానబోయిన రాజ్‌కుమార్ తెలిపారు. క్యాంపు కార్యాలయంలో నర్సంపేట డివిజన్‌స్థాయి కబడ్డీ క్రీడోత్సవాల పోస్టర్లను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరించారు. కబడ్డీ క్రీడా పోటీల్లో పాల్గొని స్నేహభావంతో ఆడాలని పెద్ది క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, ఎంపీపీ కాట్ల భద్రయ్య, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ తోకల నర్సింహారెడ్డి, సెక్రటరీ యాదగిరి, సుధాకర్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.