హనుమకొండ చౌరస్తా, మే 27 : ప్రభుత్వ పాఠశాలలు మూసివేత దిశగా సాగుతున్నాయి. విద్యార్థులు లేని (జీరో ఎన్రోల్మెంట్) బడులను మూసివేస్తుండగా, ఉపాధ్యాయులు లేని స్కూళ్లను సమీప వాటిలో విలీనం చేస్తున్నారు. ఇలా గత ఐదేళ్లలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 474 పాఠశాలలకు తాళం పడింది. ఈ విద్యా సంవత్సరంలో మరిన్ని బడులు బంద్ కానున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఉపాధ్యాయులు చొరవ తీసుకోకపోవడంతోనే అనేక పాఠశాలలు మూతపడుతున్నట్లు ఆరోపణలున్నాయి.
979 ఏకోపాధ్యాయ స్కూళ్లు
ఒక్క విద్యార్థి లేని ప్రభుత్వ బడులు తెలంగాణలో అత్యధికంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పేర్కొనగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అలాంటివి 500కు పైగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే 979 ఏకోపాధ్యాయ స్కూళ్లు ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అత్యవసర సమయంలో అక్కడి ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఆ పాఠశాలకు తాళం వేయాల్సిందే. ఒక్క ఉపాధ్యాయుడితోనే నెట్టుకొస్తుండటంతో తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపడంలేదు.
రాష్ట్రంలోనే వరంగల్ టాప్
మూతపడిన స్కూళ్ల విషయంలో వరంగల్ జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేకపోవడం, ఇంగ్లిష్ మీడియంలో బోధించకపోవడంతో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడంలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 3,369 ప్రభుత్వ పాఠశాలలుండగా, వాటిలో 13,641 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వరంగల్‌లో 135, జనగామ 70, హనుమకొండ 36, భూపాలపల్లి 30, మహబూబాబాద్‌లో 167 స్కూళ్లు జీరో ఎన్రోల్మెంట్ కింద ఇప్పటికే మూతపడ్డాయి. ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసి, వారిని సమీప స్కూళ్లకు అనుసంధానించారు. ప్రధానంగా ఆంగ్ల మాధ్యమంపై ఆసక్తితో ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపడం, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వెళ్లడం తదితర కారణాలతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గింది.
గృహ గణనలో టీచర్లు..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు ఏటా విద్యాశాఖ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అయితే క్షేత్రస్థాయిలో స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడం, తల్లిదండ్రులకు ప్రైవేట్ విద్యాసంస్థలపై మోజుతో దాని లక్ష్యం నెరవేరడం లేదు. దీనికితోడు కేంద్ర ప్రభుత్వ జనగణనలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు గృహ గణన సర్వేలో పాల్గొంటున్నారు. దీంతో బడిబాట కార్యక్రమంలో పాల్గొనలేకపోవడంతో సర్కారు స్కూళ్లలో ఎన్రోల్మెంట్ జరగడం లేదు. ఫలితంగా విద్యార్థులు లేని ప్రభుత్వ స్కూళ్లకు తాళం పడనుంది. అయితే ఆయా గ్రామాల ప్రజలు తమ పిల్లలను పంపిస్తామని కోరితే సర్కారు బడులను తెరిచి టీచర్లను నియమిస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతుండడం కొసమెరుపు.