శాయంపేట, జూన్ 30 : గ్రామస్తులు సంకల్పించారు.. మండల విద్యాధికారి చొరవ తీసుకోవడంతో మూతబడిన సర్కారు బడి సోమవారం తెరుచుకుంది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల శివారు గొల్లపల్లి పీఎస్ నాలుగేళ్లుగా మూతబడింది. పిల్లలు లేకపోవడంతో అప్పటి నుంచి బడి బందైంది. ఈ విద్యా సంవత్సరం నుంచి తమ గ్రామంలో సర్కారు బడిని తెరిపించాలని గొల్లపల్లి గ్రామ ప్రజలు మండల విద్యాశాఖ అధికారి గడ్డం భిక్షపతికి విజ్ఞప్తి చేశారు. తమ పిల్లలను బడికి పంపిస్తామని టీచర్ను కేటాయించి తెరిపించాలని కోరారు. ఈ క్రమంలో గొల్లపల్లి బడిని తెరిపించేందుకు ఎంఈవో గడ్డం భిక్షపతి చర్యలు తీసుకున్నారు. అక్కడి అంగన్వాడీ టీచర్లను కూడా గ్రామంలో పిల్లలపై సర్వే చేయించారు. 15 నుంచి 20 మంది వరకు పిల్లలున్నారని వాళ్లు నిర్ధారించారు. విద్యార్థులు బడికి వచ్చే అవకాశాలను పరిగణలోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో వెంటనే ఎంఈవో కాట్రపల్లి గ్రామంలోని బడి నుంచి ఎస్జీటీ టీచర్ను గొల్లపల్లికి డిప్యుటేషన్ వేశారు. సోమవారం గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలను తిరిగి ప్రా రంభించారు. పది మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకుని జాయిన్ అయ్యారు. పాఠశాలకు వెళ్లిన ఎంఈవో భిక్షపతి, ఎంపీవో రంజిత్, ఆర్ఐ, ఏఎస్వోల సమక్షంలో బడిలో పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఎంఈవో భిక్షపతి మాట్లాడుతూ గొల్లపల్లి గ్రామస్తులు తమ పిల్లలను సర్కారు బడికే పంపిస్తామని చెప్పినట్లు తెలిపారు. సర్కారు బడిని బతికించుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామస్తులు ముందుకు రావడం అభినందనీయమని, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగితే ఉన్నతాధికారులతో మాట్లాడి సకల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామస్తులు సర్కారు బడికే పిల్లలను పంపించాలని, బడిని కాపాడుకోవాలని సూచించారు. బడిని నిలదొక్కుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య అందుతున్నదని, పిల్లలను పెద్ద సంఖ్యలో పంపించాలన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.